పర్యావరణవేత్తలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముంబయి మెట్రో రైల్వే సంస్థ.. ఆరే ప్రాంతంలో కార్ షెడ్డు నిర్మించకుండా నిలువరించాలని వేసిన మరో పిటిషన్‌నూ బొంబాయి హైకోర్టు తాజాగా కొట్టివేసింది.
ఇంతకు ముందు..
ముంబయి మెట్రో రైల్వే సంస్థ.. ఆరే ప్రాంతంలో కారు షెడ్డును నిర్మించాలనుకుంది. అందుకోసం అక్కడున్న దాదాపు 2,600 చెట్లను తొలగించాలనుకుంది. పలు ఎన్జీఓలు, పర్యావరణవేత్తలు దీనిని అడ్డుకున్నారు. ఇందుకోసం మెట్రోకు వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం మెట్రోకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటలకే చెట్ల నరికివేతను ముంబయి మెట్రో (ఎమ్ఎమ్ఆర్సీఎల్) ప్రారంభించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన పర్యావరణవేత్తలు.. తీర్పు నిలుపుదల చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, ఏకే మీనన్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. చివరికి ముంబయి మెట్రోకే అనుకూలంగా తీర్పునిచ్చింది.