తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జామియా' హింసలో నిజ నిర్ధరణ పిటిషన్​పై విచారణ..! - జామియా వర్సిటీ అల్లర్ల పిల్​ స్వీకరించిన హైకోర్టు

దిల్లీ జామియా వర్సిటీలో ఈ నెల 15న జరిగిన ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్​ విచారణకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది. హింసాయుత ఘటనపై నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలని న్యాయవాది రిజ్వాన్ ఈ​ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై రేపు వాదనలు వింటామని స్పష్టం చేసింది కోర్టు.

HC agrees to hear PIL
'జామియా' హింసలో నిజ నిర్ధరణ పిటిషన్​పై విచారణ..!

By

Published : Dec 18, 2019, 2:08 PM IST

దిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో హింసాయుత ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు అంగీకరించింది. వర్సిటీలో జరిగిన ఘటనపై నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలన్న వ్యాజ్యంపై గురువారం వాదనలు వింటామని స్పష్టం చేసింది.

న్యాయవాది రిజ్వాన్​ ఈ పిటిషన్​ను దాఖలు చేశారు. "పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా.. వారిలో అసాంఘిక శక్తులు ఉన్నాయన్న నెపంతో పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో యువతులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు" అని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

సుప్రీం, హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో...

సుప్రీం కోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సభ్యులుగా నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని రిజ్వాన్​ కోరారు. నిజనిర్ధరణ కమిటీ నివేదిక వచ్చే వరకు విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఒకవేళ ఇంతకు ముందు కేసులు నమోదు చేస్తే తదుపరి చర్యలకు ఉపక్రమించకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కోరారు పిటిషనర్. విశ్వవిద్యాలయం లోపలకు పోలీసులు ఇష్టానుసారంగా రాకుండా చూడాలన్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ విద్యార్థులకు వైద్యం కోసం పరిహారం చెల్లించేలా దిల్లీ ప్రభుత్వం, పోలీసులను ఆదేశించాలని రిజ్వాన్​ అభ్యర్థించారు.

ఈ నెల 15న పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు జామియా వర్సిటీలో తీవ్ర హింసకు దారితీశాయి. ఈ ఘటన సహా దేశవ్యాప్తంగా జరిగిన హింసపై సీబీఐ లేదా సిట్ దర్యాప్తు కోరుతూ కొందరు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్​లను న్యాయస్థానం తోసిపుచ్చింది. సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని సూచించింది.

ఇదీ చూడండి:'నిర్భయ' దోషి రివ్యూ పిటిషన్​ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details