కరోనా వైరస్ దెబ్బతో పానీపూరీ ఇష్టపడే వారి నోటికి తాళం పడింది. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలుగా దాన్ని రుచి చూసే అవకాశమే లేకుండాపోయింది. మన దేశంలో ఎక్కడికెళ్లినా పానీపూరీ బండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. వాటిని తినడానికి కూడా జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. మూడు నెలలుగా ఇళ్లకే పరిమితమైన ఆ చిరు వ్యాపారులు ఆంక్షల సడలింపులతో ఇప్పుడిప్పుడే మళ్లీ రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే, ఇప్పుడు వాటిని తినడానికి మాత్రం ప్రజలెవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావంతో ఎవరికి వారు తమ ఇంట్లోనే స్వయంగా వండుకొని తింటున్నారు.
ఏటీఎం లాగే..
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పానీపూరీ ప్రియుల మనసు అర్థం చేసుకున్న ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేశాడు. అచ్చం ఏటీఎం మెషిన్‌ను తలపించేలా ఓ పానీపూరీ యంత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. ఇది నమ్మశక్యం కాకపోయినా ఓ పోలీస్ అధికారే దీన్ని స్వయంగా వెల్లడించారు. ఎవరూ ముట్టుకోకుండా, డబ్బులు చెల్లించిన వారు మాత్రమే సంతోషంగా పానీపూరీ తినొచ్చు. ఏటీఎంను ఎలా ఉపయోగించుకుంటామో అలాగే దాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అసోంకు చెందిన అదనపు డీజీపీ హర్దిసింగ్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది భారత్‌లో ఆవిష్కరించిన నూతన పరికరం అని.. ఆటోమేటిక్‌గా పానీపూరీ అందిస్తుందని వెల్లడించారు.