శీతగాలుల్ని భోగిమంటలతో ఎదుర్కోవాలంటారు. భోగిపండగకు అటుఇటుగా నెలరోజుల ముందు ముగిసే ఈ పార్లమెంటు శీతకాల సమావేశాల్లో అధికార విపక్షాలు పదునైన అస్త్ర శస్త్రాలతో పరస్పరం తలపడేందుకు సంసిద్ధం కావడంతో వేడి ముందే మొదలైంది. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికార పీఠమెక్కాక జరుగుతున్న మలి సమావేశాల్లో మొన్నటిదాకా మిత్రపక్షంగా ఉన్న శివసేన తొలిసారి భాజపా వైరిపక్షాలతో కలిసి పాల్గొంటోంది.
కిందటి సమావేశాల్లో 67 ఏళ్ల్ల పార్లమెంటు చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 36 బిల్ల్లులకు చట్టరూపమిచ్చి రికార్డు సృష్టించిన మోదీ ప్రభుత్వం- ఇప్పుడు ఇంచుమించు అదే సంఖ్యలో బిల్లులతో సమాయత్తమైంది. భాజపా అజెండాకు మూలస్తంభాలవంటి కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దుతోపాటు ముమ్మార్లు తలాక్‌ను చట్టవిరుద్ధంగా తేల్చి; శతాబ్దాలుగా హిందూ ముస్లిముల మధ్య నలుగుతున్న అయోధ్య వివాదంలో రామాలయ నిర్మాణానికి అనుకూల తీర్పు సాధించిన కేంద్ర ప్రభుత్వం- అదే ఊపును కొనసాగిస్తూ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అంశాన్ని ఈ సమావేశాల్లో చర్చకు పెట్టవచ్చన్న అంచనాలు హోరెత్తుతున్నాయి.
అయోధ్య తీర్పు అనంతరం మాట్లాడుతూ- ఇక ఉమ్మడి పౌర స్మృతి అమలుకు సమయం ఆసన్నమైందంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు... యూసీసీ బిల్లును భాజపా సర్కారు ఏ క్షణంలోనైనా తెరమీదకు తీసుకురావచ్చన్న అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవంక కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అజెండాను నెగ్గించుకొనే విషయంలో గతంలో విపక్షాలను విడదీసి, అందులో కొందరిని తమతో కలుపుకొని వ్యూహాత్మకంగా మద్దతు కూడగట్టిన మోదీ సర్కారు, యూసీసీపై ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్న విషయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది!
మతానికో చట్టం....
చట్టబద్ధమైన ప్రతి అంశమూ ధర్మబద్ధం కాకపోవచ్చు. రోడ్డు మీద ప్రమాదానికి గురైన బాలుడిని వైద్యశాలకు చేర్చే క్రమంలో కారును అతివేగంతో నడిపితే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కోణంలో అది చట్టవ్యతిరేకమవుతుంది. పసిబాలుడి ప్రాణం కాపాడే తరుణంలో ప్రతి క్షణమూ అమూల్యమే కాబట్టి వేగ నియంత్రణలతో నిమిత్తం లేకుండా వేగిరం వైద్యశాలకు చేర్చడమన్నది- పూర్తిగా ధర్మబద్ధం.
భిన్న మతాలు, తెగలు, ఉప తెగల్లో అనాదిగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా దేశంలో 200కు పైగా పర్సనల్ లా(వ్యక్తిగత చట్టాలు)లు అమలులో ఉన్నాయి. వివాహం, విడాకులు, పునర్వివాహం, దత్తత, జనన మరణాలు, ఆస్తుల పంపకం, వారసత్వం వంటి వివిధ అంశాలకు సంబంధించి భిన్న మతాలు, తెగలకు వాటికే ప్రత్యేకమైన చట్టాలు, నిబంధనలున్నాయి. మంచి, చెడు, పాపం, పుణ్యం ప్రాతిపదికన మత విశ్వాసాలకు భాష్యకారులు చెప్పుకొన్న వ్యాఖ్యానాలకు అనుగుణంగా వివాహం, విడాకులు, ఆస్తి పంపకం వంటి వ్యవహారాల్లో వ్యక్తిగత నిబంధనల మేరకు నడుచుకోవడం అనాదిగా అమలవుతున్న ధర్మం! ఇది కట్టుబాట్లతో ముడివడిన అంశం.
హిందువులు, ముస్లిములు, పార్సీలు, క్రైస్తవులు, సిక్కులు, నాగా వంటి తెగల పేరిట సమూహానికో చట్టం ఉన్న ఈ పరిస్థితిని మార్చి- దుర్విచక్షణకు, అసమానతలకు తావులేకుండా సువిశాల భారతావనికి నిర్దిష్టంగా వర్తించే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని రాజ్యాంగ నిర్మాతలు అభిలషించారు. మతాలు, భాష్యకారుల అభిమతాలతో నిమిత్తం లేకుండా ఏ సమూహానికి చెందిన సమస్యనైనా కోర్టుల పరిధిలో నిగ్గుతేల్చే ఈ ఉమ్మడి శాసనం పూర్తిగా న్యాయానికి సంబంధించిన అంశం! ఒకే పౌర స్మృతి(యూనిఫైడ్ సివిల్ కోడ్)పై చర్చ జరిగిన ప్రతిసారీ ఈ న్యాయ ధర్మాల అంశం తెరపైకి వస్తూనే ఉంది. వైయక్తిక శాసనాల స్థానే 44వ అధికరణ రూపంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రజలు, ప్రభుత్వాలు సాధించుకోవాల్సిన రాజ్యాంగ ఆదర్శంగా ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితర రాజ్యాంగ నిర్మాతలు ఉమ్మడి శిక్షా స్మృతి తరహాలోనే దేశం యూసీసీని కూడా సాధించుకోవాలని బలంగా ఆకాంక్షించారు. సామాజిక పురోగతికి, అభ్యుదయానికి మత చట్టాలను సంస్కరించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసిన అంబేడ్కర్- ఆ పని ఆయా మతాలు, తెగల అంగీకారంతో జరగాలే తప్ప ఎవరిపైనా ఉమ్మడి పౌర స్మృతిని బలవంతంగా రుద్దరాదని చెప్పడం గమనార్హం. హిందూ కోడ్ బిల్లు 1954-55లో అమలులోకి వచ్చింది. అది పట్టాలకెక్కడానికి పద్నాలుగేళ్లకు ముందే 1941లో హిందూ మత చట్టాల సమీక్షకు ‘హిందూ లా రిఫార్మ్స్’ కమిటీని ఏర్పాటు చేశారు.
మత చట్టాల సవిస్తర పరిశీలనానంతరం సంబంధిత కమిటీ సమర్పించిన నివేదికపై సర్వత్రా చర్చ జరిగింది. అనంతరం ఆ కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను మూడు దశల్లో ఆమోదించారు. మరోవైపు- విడాకులు (తలాక్), బహుభార్యత్వం, మహిళల వారసత్వ హక్కులకు సంబంధించి ముస్లిముల‘షరియా’ (అల్లా వాణి)లోని అసంగతాలను సరిచేయడం కోసం రాజ్యాంగ నిర్మాతలు చేసిన ప్రయత్నాలకు ముస్లిం మతపెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉమ్మడి పౌర స్మృతి భావన ఆచరణకు రాని రాజ్యాంగ ఆదర్శంగానే మిగిలిపోయింది.
హక్కుల కోసం పోరాటం...
‘దేశంలో ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఉమ్మడి శాసనాలు ఉండాలన్నదే నా ఆకాంక్ష! పార్లమెంటు సభ్యులెవరైనా ఆ మేరకు బిల్లు ప్రవేశపెడితే వారికి నా సంపూర్ణ సానుభూతిని తెలియజేస్తాను. అయితే దేశంలో ఈ చట్టం తీసుకువచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. ఉమ్మడి పౌర స్మృతి ఆగమనానికి సమాజాన్ని సమాయత్తం చేయాల్సి ఉంది’- భారతావని ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి.
ఆరు దశాబ్దాల క్రితం ‘యూసీసీ’ కోసం రాజ్యాంగ నిర్మాతలు కావించిన ప్రయత్నాలకు ఆనాటి ముస్లిం మత పెద్దలనుంచి ఏ స్థాయి వ్యతిరేకత వ్యక్తమైందన్న వాస్తవానికి ఆ మాటలు దర్పణం పడతాయి. మహిళలపట్ల అణచివేతకు, దుర్విచక్షణకు కారణమైన హిందూ పర్సనల్ లాను అయిదో దశాబ్దం మలినాళ్లలో క్రోడీకరించడం ద్వారా హిందూ సోదరీమణులకు తాను న్యాయం చేయగలిగినా- ‘షరియా’ చట్టాలను మార్చలేకపోవడం ద్వారా ముస్లిం అక్కచెల్లెళ్లకు న్యాయం చేయలేకపోయినట్లు తరవాతి కాలంలో నెహ్రూ ఆవేదన వ్యక్తీకరించడం ఈ సందర్భంగా గమనార్హం.