దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణకు డిమాండ్ చేశారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. హాథ్రస్ జిల్లా బుల్గఢీలో బాధిత కుటుంబాన్ని రాహుల్, ప్రియాంకలతో కూడిన ఐదుగురు సభ్యుల కాంగ్రెస్ బృందం శనివారం రాత్రి పరామర్శించింది. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చింది. రాహుల్, ప్రియాంక దాదాపు 45 నిమిషాల పాటు బాధిత కుటుంబంతో మాట్లాడారు. అనంతరం వారి డిమాండ్లను ప్రియాంక ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
హాథ్రస్ బాధితురాలి కుటుంబం 5 డిమాండ్లు 1. ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో న్యాయవిచారణ చేపట్టాలి.
2. హాథ్రస్ జిల్లా మెజిస్ట్రేట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఆయన్ను ఏ విధమైన ముఖ్య పదవుల్లో నియమించవద్దు.
3. తమ అనుమతి లేకుండా పెట్రోల్ పోసి తమ కుమార్తె దహన సంస్కారాలు ఎందుకు చేశారు?
4. తమను పదే పదే.. తప్పుదోవ పట్టించడం, బెదిరించడం ఎందుకు చేస్తున్నారు?
5. హిందూ సంప్రదాయం ప్రకారం తమ కుమార్తె చితాభస్మం తాము తెచ్చుకున్నామని, అయితే... ఆ చితాభస్మం తమ కుమార్తెదేనని ఎలా నమ్మాలి?
ఈ ప్రశ్నలకు సమాధానం పొందడం బాధిత కుటుంబం హక్కు అని తెలిపారు ప్రియాంక. వీటికి యూపీ సర్కారు సమాధానం చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
హాథ్రస్ యువతి కుటుంబ సభ్యులను కలిసిన రాహుల్ గాంధీ వారి బాధను అర్థం చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉండి, న్యాయం జరిగేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మృతురాలికి న్యాయం జరిగేలా దేశం మొత్తం అండగా ఉన్నందున.. యూపీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరించలేదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
హైడ్రామా..
రాహుల్, ప్రియాంక హాథ్రస్ బయలుదేరే ముందు దిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. హాథ్రస్లో 144 సెక్షన్ కొనసాగుతున్నందున పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో దిల్లీ-నోయిడా వంతెనపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పెద్ద సంఖ్యలో గుమిగూడిన కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీఛార్జీ చేస్తుండగా.. ప్రియాంక గాంధీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ మగ పోలీసు ప్రియాంక గాంధీ కుర్తాను పట్టుకున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళలను యూపీ సర్కారు అగౌరవపరుస్తోందంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు.
కేసు సీబీఐకి..
హాథ్రస్ ఘటనపై యూపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తీవ్ర వివాదాస్పదమైన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన పూర్వాపరాలన్నిటిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.