హాథ్రస్ ఘటనపై హింస రాజేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘర్షణలను ప్రేరేపించటానికి రూ.100 కోట్లు విదేశీ సంస్థలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.50 కోట్లు ఒక్క మారిషస్ నుంచే వచ్చినట్లు ఈడీ గుర్తించింది.
రాష్ట్రంలో హాథ్రస్ ఘటనను ఆధారంగా చేసుకుని కుల ఘర్షణలు ఉసిగొల్పేలా విదేశాల నుంచి కుట్ర జరుగుతోందని యోగి ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశీ నిధులు అందాయన్న అనుమానాలతో 'జస్టిస్ ఫర్ హాథ్రస్ విక్టిమ్' అనే వెబ్‌సైట్‌పై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది.
వెబ్‌సైట్‌పై విచారణ..
ఈ కుట్రకు సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసును త్వరలోనే నమోదు చేయనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంతో సంబంధమున్న వాళ్లను అరెస్టు చేసి, విచారించనున్నట్లు స్పష్టం చేశాయి. ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తున్నట్లు ఈడీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ తెలిపారు.