ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో సామూహిక హత్యాచారానికి గురై మృతి చెందిన బాధితురాలికి.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి పలు రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఉత్తర్‌ప్రదేశ్ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... ఓ భారత పుత్రిక అత్యాచారానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రభుత్వం వాస్తవాలు అణచివేస్తోందని ఆరోపించిన రాహుల్.. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని మండిపడ్డారు.
యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ... బాధితురాలికున్న అన్ని హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాసిందని, చివరికి అంత్యక్రియల విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించిందని విమర్శించారు.
ఈ ఘటనలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి.... ఈ విషయంలో సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకోవాలని.. లేకుంటే బాధితురాలికి, ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అనిపించడం లేదని అన్నారు.
నిందితులు క్రూరమైన అనాగరిక చర్యకు పాల్పడ్డారన్న వామపక్ష పార్టీలు... నేరం జరిగిన తర్వాత ఐదురోజుల వరకు పోలీసులు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా అంత్యక్రియలు జరిపించడాన్ని తప్పుపట్టిన విపక్ష నేతలు అందుకు కారణమైన వాళ్లను శిక్షించాలని డిమాండ్ చేశారు.
హథ్రాస్ ఘటనపై కాంగ్రెస్ నిరసనలు
బారికెట్ల ఏర్పాటు చేసిన పోలీసులు
మరోవైపు జాతీయ మహిళా హక్కుల కమిషన్ సైతం పోలీసుల తీరును తప్పుపట్టింది. అర్థరాత్రి దహన సంస్కారాలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించిన కమిషన్.. ఈ విషయమై యూపీ డీజీపీ నుంచి వివరణ కోరినట్లు వెల్లడించింది. అంత్యక్రియలపై వస్తున్న ఆరోపణలను ఖండించిన జిల్లా మేజిస్ట్రేట్... అంత్యక్రియల సమయంలో ఆమె కుటుంబ సభ్యులు సైతం ఉన్నారని, వారి అనుమతితోనే ఆ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నట్లు తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.