ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. హాథ్రస్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు... బాధితులపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు... బాధితులకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా మహిళలు దీనిపై స్పందించాలన్నారు. 'బాధితులకు అండగా నిలిచి, నిందితులను జైలుకు పంపాలి. ఈ అంశం లక్షలాది మహిళలకు సంబంధించినది. కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేయాలి' అని హితవు పిలికారు.
'హథ్రస్ ఘటనలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానవీయం, అనైతికం. బాధితులకు సాయం చేయాల్సిన ప్రభుత్వం... నిందితులకు కొమ్ముకాస్తోంది. మార్పు వైపు ఓ అడుగు వేద్దాం. దేశవ్యాప్తంగా మహిళలకు జరగుతున్న అన్యాయాన్ని గురించి ప్రశ్నిద్దాం' అని "స్పీకప్ ఫర్ వుమెన్ సేఫ్టీ" హ్యాష్ ట్యాగ్‌తో ఓ వీడియోను జోడించి ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.