భాజపా నాయకులు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారంటూ 170 మందికిపైగా మహిళా సంఘాల కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకీ బహిరంగ లేఖ రాశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అత్యాచార ఘటనలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై భాజపా నాయకులు తమ అనుచరులను హింసకు ప్రేరేపించడం ఏంటని ప్రశ్నించారు.
" అత్యచార ఘటనలను భాజపా నాయకులు ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలను బెదిరిస్తున్నారు. ఈ రకమైన విద్వేషాలు దేనికి? ప్రభుత్వాధినేతగా మీరు ఇలాంటివి ప్రోత్సహిస్తారా? భాజపాకు ఓటు వేయకపోతే అత్యాచారానికి గురవుతారు అని అంటున్నారు. ఇదేనా దిల్లీ మహిళలకు మీరిచ్చే ఎన్నికల సందేశం. ఎన్నికల్లో గెలుపుకోసం మీ పార్టీ ఎంతకైనా తెగిస్తుందా?"
- లేఖలో మహిళా సంఘాలు
భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ.. మహిళలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 'దేశ ద్రోహులను కాల్చమని' అన్న మాటలను లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు.