తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ బరి: వలస కార్మికులు నితీశ్​కు జైకొట్టేనా?

బిహార్​లో నిరుద్యోగం సమస్య తీవ్రతను తెలియచెప్పింది కరోనా లాక్​డౌన్. లక్షలాది మంది శ్రమజీవులు బతుకు జీవుడా అంటూ పొరుగు రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు తిరిగి రావడం... ఉపాధి కల్పనలో ప్రభుత్వాల వైఫల్యాలకు అద్దం పట్టింది. మరి ఈ పరిణామం శాసనసభ ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? '20 లక్షల మందికి స్థానికంగా ఉపాధి'పై నితీశ్​ హామీ... ఓట్లు రాబడుతుందా?

By

Published : Oct 20, 2020, 2:52 PM IST

trust of migrant workers
బిహార్​ బరి: నితీశ్​ ప్రభుత్వం.. వలస కార్మికుల విశ్వాసం కోల్పోయిందా ?

1,00,00,000.... కరోనా లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, స్వస్థలాలకు తిరిగి వెళ్లిన వలస కార్మికుల సంఖ్య. ఇందులో 15 లక్షల మంది బిహారీలే. ఈ జాబితాలో యూపీ(32.5 లక్షలు) అగ్రస్థానంలో ఉండగా... బంగాల్​(13.8 లక్షలు) మూడో స్థానంలో ఉంది. ఈ మేరకు ఇటీవల పార్లమెంటులో వెల్లడించింది కేంద్ర కార్మిక శాఖ.

ఆకలి కష్టాలు, కరోనా భయాలతో సొంతూళ్లకు తిరిగి వచ్చినవారు ఎంతో కాలం నిలవలేదు. తిరిగి నగరాల బాట పట్టారు. కరోనా ఉద్ధృతి తగ్గకపోయినా... ఉపాధి వేట సాగిస్తున్నారు.

దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నా... బిహార్​ మాత్రం ప్రత్యేకం. అందుకు కారణం... శాసనసభ ఎన్నికలే. వలస కూలీల కష్టం ఇప్పుడు ఆ రాష్ట్రం రాజకీయాంశమైంది.

ఇళ్లకు వెళ్లిపోయిన కార్మికులు

ప్రభుత్వ హామీ

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ 20 లక్షలమంది​ వలస కార్మికులకు రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి చాకిరీ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

అందుకోసం.. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్

కార్మికుల అవస్థలు

అయితే, ఇవేవీ వలస కార్మికులకు కనుచూపు మేరలో కూడా కనిపించటం లేదు. మరోవైపు ఆకలి, నిరుద్యోగం వారిని దహించివేసే పరిస్థితులు వచ్చేశాయి. ఎదురుచూపులకే పరిమితమయ్యారు.

"మేము రోజులో మరోపూట భోజనం చేస్తామో లేదో కూడా తెలియదు. ప్రభుత్వం పథకాలు, ప్రణాళికల గురించి గొప్పగా చెబుతోంది.. మేం ఉపాధి కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాం. ఇంకెలా ఓటేస్తాం ? జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. బిహార్​కు తిరిగొచ్చినపుడు కొంతైనా ఆహారం దొరికింది. కానీ ఇప్పుడు.. తిండిగింజల కోసం అవస్థలు పడుతున్నాం. బిహార్​లో ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు."

-ఓ వలస కార్మికుడి వ్యథ

ఆకట్టుకునే ప్రయత్నాలు

ఈ పరిస్థితుల్లోనే శాసనసభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. పార్టీలన్నీ.. వలస కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వలసల సంక్షోభాన్ని పరిష్కరించడంలో నితీశ్​ ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు ప్రచారం సాగిస్తున్నాయి.

నితీశ్​ ప్రభుత్వంపై వలస కార్మికుల అసంతృప్తి!

రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి పదేపదే చెబుతున్నారు నితీశ్. వలస కూలీలు మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వం తమ కనీస అవసరాలు తీర్చలేకపోయిందని గుర్రుగా ఉన్నారు. ఇప్పటికీ ఆహారానికి, ఉపాధికి అలమటిస్తున్న తమను.. ఓట్లు అడిగే హక్కు ప్రభుత్వానికి లేదన్నది వారి మాట. "ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియలో మా భాగస్వామ్యం పరిమితంగానే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించట్లేదు. జీవనోపాధి, ఆదాయ వనరుల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాం" అంటున్నారు బిహారీ వలస కార్మికులు.

ఇదీ చూడండి: బిహార్ బరి: నాలుగోసారి నితీశ్ అధికారం నిలబెట్టుకునేనా ?

ఇదీ చూడండి: వాళ్ల హయాంలో ఆటవిక రాజ్యంగా ఉండేది: నితీశ్‌

ABOUT THE AUTHOR

...view details