బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏకు, వారసత్వ రాజకీయాలను ఆరాధించే మహాకూటమికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సమస్తీపుర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
'ప్రజాస్వామ్యమా? వారసత్వ రాజకీయాలా?'
బిహార్‌లో మహాకూటమిపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న ఎన్డీఏకు, వారసత్వ రాజకీయాలకు అంకితమైన వారికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. సీఎం నితీశ్‌కుమార్, మోదీ బంధువులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా? అని ప్రజలను ప్రశ్నించారు.
"బిహార్ సీఎం నితీశ్ కుమార్ బంధువులు ఎవరైనా రాజ్యసభలో ఉన్నారా? మోదీ కుటుంబీకులు ఎవరైనా పార్లమెంటులో ఉన్నారా?" అని ప్రజలను ప్రశ్నించారు ప్రధాని. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బిహార్‌లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయ రంగంలో మౌలికసదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు మోదీ గుర్తు చేశారు.
ఈ ర్యాలీలో ప్రధానితో పాటు బిహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు.