తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణాపై ఎగ్జిట్ పోల్స్​ మాటేంటి? 2014 ఫలితం ఏంటి?

హరియాణాలో వరుసగా రెండోసారి భాజపా అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్​ అంచనా వేశాయి. మొత్త 90 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 47 సీట్లు గెలుచుకున్న కాషాయ దళం.. ఈసారి మరిన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఇవి ఎంతవరకు నిజమో.. మధ్యాహ్నం వరకు స్పష్టత రానుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్​ ప్రారంభమవుతుంది.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

By

Published : Oct 24, 2019, 5:15 AM IST

హరియాణాలో అయిదేళ్ల క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపాదే ఈ సారి కూడా విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రిగా మనోహర్​ లాల్​ ఖట్టర్​ రెండోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు మరోసారి విపక్ష పాత్రే అని సర్వేలు తేల్చాయి. అయితే ఇండియాటుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వే మాత్రం భాజపా-కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉందని తెలిపింది. జననాయక్‌ జనతా పార్టీ కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించనుందని అభిప్రాయపడింది.

హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 21న జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం 8గంటలకు ప్రారంభమతుంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు ఎంతవరకు నిజమవుతానే విషయంపై మధ్యాహ్నం వరకు స్పష్టత వస్తుంది.

భాజపా-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ

హరియాణాలో అధికారంలో ఉన్న భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్యే ఈసారి ప్రధాన పోటీ. రెండు పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. భాజపా, కాంగ్రెస్ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేశాయి. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నుంచి వేరుపడి, మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పడ్డ జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) తొలి సారి అదృష్టం పరీక్షించుకుంది. బీఎస్పీ 87 స్థానాల్లో పోటీ చేయగా ఐఎన్​ఎల్​డీ 81 సీట్లలో బరిలో నిలిచింది. మరో 375 మంది స్వతంత్రులూ పోటీ చేశారు.

2014 ఎన్నికల ఫలితాలు

2014లో హరియాణాలో 90 స్థానాలకు గాను భాజపా 47 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్‌ 15 స్థానాలు, ఐఎన్​ఎల్​డీ 19 సీట్లలో విజయం సాధించాయి. జింద్‌ ఉప ఎన్నికలో నెగ్గి భాజపా తన బలాన్ని 48కి పెంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details