సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో చేపడుతోన్న రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమయ్యారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్. రైతుల ఆందోళనలు, పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు అధికావర్గాలు తెలిపాయి.
సమావేశానంతరం కీలక విషయాలు వెల్లడించారు కట్టర్. రైతుల సమస్యను సత్వరం పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు.
" వచ్చే 2-3 రోజుల్లో చర్చలు జరుగుతాయని నమ్ముతున్నా. చర్చల ద్వారానే రైతుల ఆందోళనలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యను త్వరితంగా పరిష్కరించాలని మంత్రికి విన్నవించాను. సట్లేజ్ యమునా లింక్ కెనాల్ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని పంజాబ్ రైతులను కోరుతున్నా. సాగు నీటి కొరతతో హరియాణా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపైనా చర్చించాం. ఈ కెనాల్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. "