మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370, 35A రద్దు చేసిన సందర్భంగా భాజపా శ్రేణుల్లో హుషారు పెరిగింది. ఆర్టికల్ 370 రద్దును పురస్కరించుకుని హరియాణాలోని ఫతేబాద్ జిల్లాలో జరిగిన సభలో 'ఇక కశ్మీర్ నుంచి వధువులను తెచ్చుకోవచ్చు' అంటూ హిమాచల్‌ప్రదేశ్ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన ప్రసంగం దుమారం రేపింది.
"అబ్బాయిల సంఖ్య కన్నా అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటే సమస్యలు వస్తాయి. బిహార్ నుంచి వధువులను తెచ్చుకోవచ్చని అప్పట్లో మా ధన్కర్ చెప్పారు. కశ్మీర్ నుంచి వధువులను తెచ్చుకోచ్చని ఇప్పుడు కొందరు అంటున్నారు. లింగ నిష్పత్తి సరిగ్గా ఉంటేనే.. సమాజంలో సమానత్వం ఉంటుంది."
- మనోహర్ లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి.
హరియాణాలో వధువులు లభించకపోతే... రాష్ట్ర యువత కోసం బిహార్ నుంచి తెప్పిస్తానని హరియాణా మంత్రి ఓపీ ధన్కర్ 2014లో అన్నారు.
మహిళ కమిషన్ తీవ్ర ఆగ్రహం..
ఖట్టర్ వ్యాఖ్యలపై జాతీయ, దిల్లీ మహిళా కమిషన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఖట్టర్ వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తాన్ని కించపరిచేలా ఉన్నాయని.. అవి హింసకు దారి తీస్తాయని పేర్కొన్నాయి.
ఈ వ్యాఖ్యలు చేసినవారిపై సెప్టెంబర్ 14లోగా చర్యలు తీసుకోవాలని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను దిల్లీ మహిళ కమిషన్ డిమాండ్ చేసింది.
తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధి డిమాండ్ చేశారు.