హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. రెండోసారి ఘన విజయం సాధిస్తుందనుకున్న భాజపాకు నిరాశే మిగిలింది. మొత్తం 90 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. అధికార భాజపా 40 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 31 చోట్ల గెలుపొందింది. 10 సీట్లు కైవసం చేసుకున్న జేజేపీ కింగ్‌మేకర్‌గా అవతరించింది. 7 స్థానాల్లో గెలుపొందిన స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది భాజపా. స్వతంత్రులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు గోపాల్ కంద, రంజీత్ సింగ్‌లను చార్టెడ్ విమానంలో దిల్లీకి తీసుకెళ్లారు భాజపా ఎంపీ సునీత దుగ్గల్. పార్టీ అధిష్ఠానంతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరితో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్నారని దుగ్గల్ తెలిపారు.
అమిత్ షాదే తుదినిర్ణయం
హరియాణా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశాలపై భాజపా అధ్యక్షుడు అమిత్ షాదే తుది నిర్ణయమని భాజపా పార్లమెంటరీ బోర్డు స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల ఫలితాల అనంతరం దిల్లీలో సమావేశమయ్యింది. మహారాష్ట్ర, హరియాణా ముఖ్యమంత్రులను మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ సమాలోచనలు..