తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణాలో హంగ్​- ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? - హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు

మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికార పీఠం నిలబెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి హరియాణాలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. కమలదళం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజార్టీకి కాస్త దూరంలో నిలిచింది. కాంగ్రెస్​ 31, జన్‌నాయక్‌ జనతా పార్టీ 10 చోట్ల గెలిచాయి. ప్రభుత్వ ఏర్పాటులో జేజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు.

హరియాణాలో హంగ్​- ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు?

By

Published : Oct 24, 2019, 6:05 PM IST

Updated : Oct 24, 2019, 9:00 PM IST

హరియాణాలో హంగ్​- ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు?

హరియాణాలో మరోమారు కమల వికాసం ఖాయమన్న అంచనాలు తప్పాయి.

భారతీయ జనతా పార్టీ ఈసారి సాధారణ మెజార్టీకి కాస్త దూరంలో నిలిచిపోయింది. 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరంకాగా భాజపా 40 చోట్ల విజయం సాధించింది.

కాంగ్రెస్‌ 31 స్థానాల్లో గెలుపొందగా.. జన్‌నాయక్‌ జనతా పార్టీ 10 చోట్ల, ఐఎన్‌ఎల్‌డీ ఒక స్థానంలో నెగ్గింది. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలకు 8 స్థానాలు దక్కాయి.

పార్టీ గెలిచిన స్థానాలు
భాజపా 40
కాంగ్రెస్ 31
జేజేపీ 10
ఐఎన్​ఎల్​డీ 1
ఇతరులు 8
మొత్తం 90

భాజపాకు ఆరుగురు...

హరియాణాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాజపాకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో 10 స్థానాలు నెగ్గిన దుష్యంత్‌ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్‌జనతా పార్టీ కీలకంగా మారనుంది. జేజేపీ మద్దతునివ్వని పక్షంలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులతో పాటు హరియాణా లోక్‌హిత్‌ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేను ఆకర్షించేందుకు కమలదళం యత్నించే అవకాశముంది.

పుంజుకున్న కాంగ్రెస్...

2014 ఎన్నికలతో పోలిస్తే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం రెట్టింపైంది. 2014లో కేవలం 15 స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్‌ ఈసారి ఏకంగా 31 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 10 స్థానాలు నెగ్గిన జేజేపీ, ఒక స్థానంలో గెలిచిన ఐఎన్‌ఎల్‌డీతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ యత్నించే అవకాశం ఉంది.

చీలిన ఐఎన్​ఎల్​డీ...

2014లో 19 స్థానాలు నెగ్గిన ఐఎన్‌ఎల్‌డీ ఈసారి పార్టీ చీలడం వల్ల ఒక స్థానానికే పరిమితమైంది. ఐఎన్‌ఎల్‌డీ నుంచి బహిష్కరణకు గురై జన్‌నాయక్‌జనతా పార్టీని ఏర్పాటు చేసిన దుష్యంత్‌ చౌతాలా 10 చోట్ల పార్టీని విజయపథంలో నిలిపారు.

ప్రముఖలు...

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కర్నాల్‌ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. భాజపా తరఫున పోటీ చేసిన ముగ్గురు క్రీడాకారుల్లో ఇద్దరికి ఓటమి ఎదురైంది. భారత హాకీ మాజీ కెప్టెన్‌, భాజపా అభ్యర్థి సందీప్‌సింగ్‌ పెహోవాలో గెలుపొందారు. ప్రముఖ రెజ్లర్‌ బబితా ఫొగాట్‌...దాద్రిలో ఓటమి చవిచూశారు. ఒలింపిక్‌ పతక విజేత, రెజ్లర్‌ యోగేశ్వర్‌దత్‌ బరోడాలో కాంగ్రెస్‌ అభ్యర్థి క్రిషన్‌హుడా చేతిలో ఓడారు. భాజపా తరఫున ఆదంపూర్‌నుంచి బరిలోకి దిగిన టిక్‌టాక్‌ స్టార్‌సోనాలీ ఫొగట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్దీప్​ బిష్ణోయి చేతిలో పరాజయం పాలయ్యారు.

కాంగ్రెస్‌నేత హరియాణా మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హుడా...గర్హి శాంప్లా-కిలోయ్‌ స్థానంలో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా మాత్రం ఖైతాల్‌లో భాజపా అభ్యర్థి లీలారామ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. జన్‌నాయక్‌జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా.... ఉచన కలాన్‌ నుంచి గెలుపొందారు. ఐఎన్​ఎల్​డీ నేత అభయ్‌ సింగ్‌ చౌతాలా ఎల్లెనాబాద్‌ నుంచి విజయం సాధించారు.

హంగ్​లో కింగ్​ ఎవరు..?

ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం వల్ల ప్రధాన పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. దిల్లీకి రావాలని హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నుంచి పిలుపువచ్చింది. కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడాతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీతో కలిసి హరియాణాలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భూపిందర్‌ సింగ్‌ హుడా వ్యాఖ్యానించారు.

Last Updated : Oct 24, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details