రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితం హంగ్ దిశగా సాగుతోంది. భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నా.. రెండు పార్టీలకు స్పష్టమైన ఆధిక్యం దక్కే అవకాశాలు కన్పించట్లేదు. దీంతో ఇరు పార్టీల చూపు చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)పై పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం భాజపా, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఆయన మద్దతు కోరుతున్నాయి.
రంగంలోకి కేంద్ర నేతలు..
ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తారుమారవడం వల్ల భాజపా, కాంగ్రెస్ కేంద్ర నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఫలితాలు సంక్లిష్టంగా ఉండటం వల్ల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను దిల్లీకి పిలిపించారు. మరోవైపు భాజపా తన మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ పెద్దలను జేజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు పంపింది.
'హస్తం' మంతనాలు...
కాంగ్రెస్ కూడా వ్యూహాలు రచిస్తోంది. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హుడాతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.
దుష్యంత్‌కు సీఎం పదవి..?
కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి చౌతాలాకు సీఎం పదవి ఇస్తామని ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది. గతంలో కర్ణాటక మాదిరిగా హరియాణాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, దుష్యంత్ మాత్రం తుది ఫలితం వచ్చాకే తన నిర్ణయం వెల్లడిస్తానని అంటున్నారు. ఈ నేపథ్యంలో హరియాణాలో భాజపా మరోసారి గద్దెనెక్కాలన్నా లేదా హస్తం పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నా.. అది ‘ఛోటా చౌతాలా’పైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.