లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పాటీదార్ల ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ఆశలు ఇప్పట్లో తీరేలా లేవు. 2015 గుజరాత్ పాటిదార్ అల్లర్ల కేసులో తనను దోషిగా పరిగణించటంపై స్టే విధించాలన్న హార్దిక్ వ్యాజ్యాన్ని గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రత్యేక కేసుల్లో మాత్రమే స్టే విధించటానికి అవకాశముంటుందని, హార్దిక్ కేసు అంత ప్రత్యేకమేమి కాదని జస్టిస్ ఏ.జి యురైజీ తీర్పునిచ్చారు. హార్దిక్‌పై 17 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ప్రభుత్వం తెలిపిందని కోర్టు పేర్కొంది.
కేసును పూర్తిగా పరిశీలించాక సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హార్దిక్ తరఫు న్యాయవాదులు తెలిపారు. గుజరాత్లో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ సమర్పించేందుకు ఏప్రిల్ 4 చివరితేది. ఈ నేపథ్యంలో గడువులోగా హార్దిక్‌కు మార్గం సుగమం అవుతుందో లేదో చూడాలి.