ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పాకిస్థాన్ మనస్ఫూర్తిగా సహకరించాలని.. అప్పుడే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. లీ మోండే అనే ఫ్రెంచ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా కనుమరుగయ్యే దశలో ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ స్పందించారు.
‘పాకిస్థాన్ ఒక ఉగ్రవాద పరిశ్రమనే అభివృద్ధి చేసి పెంచి పోషిస్తోంది. దీని ద్వారా భారత్‌లోకి ఉగ్రవాదులను తరలిస్తూ దాడులకు పాల్పడుతోంది. దీనిని పాక్ కూడా ఖండించదు. ఇప్పుడు నాకు చెప్పండి?ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇలాంటి ఒక దేశంతో ఏ దేశమైనా చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందా?ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాక్ సిద్ధంగా ఉందని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి. అప్పుడే ప్రపంచం నమ్ముతుంది’ అని జైశంకర్ పేర్కొన్నారు.