కొవిడ్-19 లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించే ఒక చేతి పట్టీ వచ్చేనెల నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. మద్రాస్ ఐఐటీ, వరంగల్ ఎన్‌ఐటీ పరిశోధకులు దీన్ని సిద్ధం చేస్తున్నారు. దీని ఉత్పాదన కోసం ఈ విద్యా సంస్థలో ఏర్పడ్డ 'మ్యూస్ వేరబుల్స్' అనే అంకుర పరిశ్రమ రూ.22 కోట్ల నిధులను సమీకరించింది. శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను తెలుసుకోవడానికి ఈ చేతి పట్టీలో సెన్సర్లు ఉంటాయి. అవి శరీరంలోని కీలక సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయి. కొవిడ్ లక్షణాలను వేగంగా గుర్తించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
మొబైల్‌తో సంధానం..
ఈ సాధనం బ్లూటూత్ సాయంతో పనిచేస్తుంది. మ్యూస్ హెల్త్ అనే యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌తో సంధానం కావచ్చు. వినియోగదారుడి ఆరోగ్య డేటా, చర్యల వివరాలు ఫోన్లోను, దూరంగా ఉన్న సర్వర్లోనూ నిక్షిప్తమవుతాయి. కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో కొవిడ్ లక్షణాలున్న వారిని పర్యవేక్షించడానికి కూడా దీన్ని వాడొచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా నోటిఫికేషన్లను ఈ సాధనం అందిస్తుంది. దీన్ని ధరించిన వ్యక్తి కంటెయిన్మెంట్ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అతడిని అప్రమత్తం చేస్తుంది. కావాలనుకుంటే.. వినియోగదారుడు అత్యవసర సందేశాన్ని కూడా పంపొచ్చు. నిర్దిష్ట స్థాయి మించి శరీర ఉష్ణోగ్రత పెరిగినా, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినా ఇది అప్రమత్తం చేస్తుంది.