దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న వేళ కేంద్రం సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్ నిరోధక చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి.
కొవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాలను మూసివేయడం సహా బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5,865 మందికి కరోనా సోకగా.. 169 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 229 మందికి మహమ్మారి సోకింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,364 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది మరణించగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 97కు చేరింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం. నిన్న వైరస్ నుంచి కోలుకున్న 125 మంది డిశ్చార్జ్ అయ్యారు.
834 మందికి...
తమిళనాడులో కొత్తగా 96 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 84 మంది తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 834కు చేరింది. ఇప్పటివరకు ఎనిమిది మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
17మంది బలి...
గుజరాత్లో గత 24 గంటల్లో 76 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గురువారం నాటికి మెత్తం 262 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.