దేశంలో ఉల్లి ధర ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి దొంగలు తమ హస్తవాటాన్ని ప్రదర్శించారు. గుజరాత్లో రూ.25,000 విలువైన వంద కిలోల ఉల్లిగడ్డలను అపహరించారు. సూరత్ పట్టణంలోని పలన్పుర్ ప్రాంతంలోని ఓ కూరగాయల దుకాణంలో ఈ చోరీ జరిగింది.
ధరలు ఆకాశాన్ని తాకిన వేళ.. ఉల్లిపై దొంగల కన్ను - onions theft in gujarat
దేశంలో ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ధర వంద రూపాయలకు పైగా పలుకుతోంది. ఫలితంగా దొంగల దృష్టి ఇప్పుడు ఉల్లిపై పడింది. తాజాగా గుజరాత్లో దాదాపు రూ.25,000 విలువైన ఉల్లిని చోరీ చేశారు. కూరగాయల దుకాణం ముందు ఉంచిన సంచులను అపహరించి పారిపోయారు.
కూరగాయల దుకాణం బయట ఉంచిన ఐదు 50 కిలోల బస్తాలను అపహరించినట్లు దుకాణంలో పనిచేసే వ్యక్తి తెలిపారు. ఇంతవరకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గుజరాత్ మార్కెట్లలో ఉల్లి ధర రూ.90 నుంచి రూ.100 మధ్య పలుకుతోంది. అధిక ధరలు ఉండటం వల్లే ఉల్లి సంచుల చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదల కారణంగా దేశంలో ఉల్లి కొరత ఏర్పడింది. గత నెల రోజులుగా మార్కెట్లోకి ఉల్లి సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఉల్లి ధరలు తారస్థాయికి చేరుకున్నాయి.