7,801 వజ్రాలు పొదగబడి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన బ్రహ్మకమలం వజ్రాన్ని వేలానికి ఉంచనున్నారు. అత్యధిక వజ్రాలు పొదిగి గిన్నిస్ బుక్‌లోనూ చోటు సంపాదించుకున్న ఈ ఉంగరాన్ని నవంబర్ 13 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. ఈ నెల 2 నుంచి వేలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. www.thedivine7801.com వెబ్‌సైట్‌లో నిర్వాహకులు ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఉంగరం రిజర్వ్ ధరను రూ.78,01,000గా నిర్ణయించారు.
సృష్టికర్త తెలుగువాడే..
హైదరాబాద్‌కు చెందిన 'ది డైమండ్ స్టోర్ బై చుందూబాయి' నిర్వాహకులు.. చందూబాయి కుమారుడు కొట్టి శ్రీకాంత్ ఈ ఉంగరాన్ని రూపొందించారు. కమలం రేకులు విచ్చుకున్నట్లు ఉండే ఈ కళాఖండం తయారీకి 11 నెలల సమయం పట్టిందన్నారు శ్రీకాంత్. దానికి 'ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం'గా పేరు పెట్టారు.