తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య భూమిపూజకు అతిథులు మరింత కుదింపు - రామమందిరం

ఈ నెల 5న జరగనున్న అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల జాబితాను మరింత కుదించారు. కరోనా వైరస్​ నేపథ్యంలో ఆ సంఖ్యను 208 నుంచి 170-180కి పరిమితం చేస్తూ నిర్ణయించారు. మరోవైపు భాజపా సీనియర్​ నేతలు అడ్వాణీ, మనోహర్​ జోషిలు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Guest list for Ayodhya Ram mandir event further decreased due to corona virus
రామమందిర శంకుస్థాపన మహోత్సవానికి అతిథులు మరింత కుదింపు

By

Published : Aug 3, 2020, 7:37 AM IST

ప్రతిష్ఠాత్మక రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల సంఖ్యలో మరికొంత కోత పడింది. ఈ నెల 5న జరగబోతున్న కార్యక్రమానికి తొలుత 208 మందిని అతిథులుగా ఆహ్వానించాలని ప్రతిపాదించారు. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని 170-180కి పరిమితం చేయాలని తాజాగా నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరగబోయే భూమి పూజకు ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌, రామజన్మభూమి న్యాస్‌ అధిపతి నృత్యగోపాల్‌ దాస్‌, సంఘ్‌ నేతలు భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే, విశ్వహిందూ పరిషత్‌ కార్యాధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితరులతో పాటు దాదాపు 50 మంది ఆధ్యాత్మికవేత్తలు హాజరు కానున్నారు. పార్టీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌జోషిలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌, ఆధ్యాత్మిక వేత్త మురారీ బాపు వంటివారి పేర్లు ఆహ్వానితుల జాబితాలో లేవు. ఆలయం కోసం ఇప్పటి వరకు రూ.18.6 కోట్లు విరాళాలుగా వచ్చాయని, వాటిని ట్రస్టు ఖాతాకు బదలాయిస్తామని మురారీ ఇటీవల ప్రకటించారు.

వేదికపై ఐదుగురే

కాశీకి చెందిన జితేంద్ర సరస్వతి, మరో ముగ్గురు వేద పండితులు కలిసి రామాలయ భూమి పూజ క్రతువు నిర్వహిస్తారు. వేదికపై ప్రధాని మోదీతో పాటు (మోహన్‌ భాగవత్‌, నృత్యగోపాల్‌ దాస్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే ఉంటారు. కరోనా తీవ్రత దృష్ట్యా శంకుస్థాపన వేడుకకు తరలి రావద్దంటూ అనుచరులకు, భక్తులకు ట్రస్టు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ఉత్సాహంతో ఎక్కువ మంది తరలివస్తే వైరస్‌ మరింత ప్రబలే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు.

సున్నీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌కు ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: రామాలయ శంకుస్థాపనలో పాలు పంచుకోవాల్సిందిగా యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ జాఫర్‌ ఫారూఖీని ట్రస్టు తరఫున ఆహ్వానించారు. బాబ్రీ మసీదు కోసం పిటిషన్‌ వేసినవారిలో ఒకరైన ఇక్బాల్‌ అన్సారీకి కూడా ఆహ్వానం పంపించారు. గత వివాదాలను పక్కనపెట్టి సామరస్య పూర్వక వాతావరణాన్ని తీసుకురావడంలో భాగంగా వీరిని వేడుకకు పిలిచారు. అయోధ్యలో ప్రముఖ సమాజ సేవకుడు మహ్మద్‌ షరీఫ్‌కు కూడా ఆహ్వానం అందింది. యోగా గురు బాబా రాందేవ్‌, మాతా అమృతానందమయి వంటివారూ ఆహ్వానితుల్లో ఉన్నారు. ఇస్లాం, క్రైస్తవ, సిక్కు మతాలకు చెందిన పలువురు ఇతర ప్రముఖుల్నీ పిలుస్తున్నారు.

ఇదీ చూడండి:-అయోధ్య: శ్రీరాముని మందిరం... వెయ్యేళ్లు పదిలం

ABOUT THE AUTHOR

...view details