జనాన్ని నాలుగు గోడలకు పరిమితం చేసి వ్యక్తుల పనిపాటలతోపాటు ప్రభుత్వ పాలనను కూడా డిజిటల్ సీమకు తరలేట్లు చేస్తోంది కరోనా మహమ్మారి. ఇంతకాలం నత్తనడక నడచిన ఎలెక్ట్రానిక్ పాలన (ఈ-పాలన)ను వడివడి అడుగులు వేయిస్తోంది. లాక్‌డౌన్ కాలంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయగా, లాక్‌డౌన్ ఎత్తివేశాక కూడా వారు నెలకు 15 రోజులపాటు ఇంటినుంచి పనిచేసేలా కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఓ ముసాయిదా విధానం వెలువరించింది.
జాతీయ ఇన్ఫర్మేటిక్స్ కేంద్రం (ఎన్‌ఐసీ) అందించిన ఇ-ఆఫీస్, వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతో సగంమంది కేంద్ర ఉద్యోగులు లాక్‌డౌన్ కాలంలో ఇంటి నుంచి పనిచేయగలిగారు. లాక్‌డౌన్ తరవాత కూడా భౌతిక దూరం పాటించడానికి వీలుగా కొంతమంది ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించగలిచారు. వారికి ఆయా మంత్రిత్వ శాఖలు ల్యాప్‌టాప్‌లు లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్లు అందిస్తాయి. వారి ఇంటర్నెట్ రుసుమును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుతం 75 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ-ఆఫీసు వేదికను ఉపయోగిస్తుండగా, వాటిలో 57 శాఖలు 80శాతం పనులను ఈ వేదిక మీదే చేస్తున్నాయి.
సంక్షోభంతో వేగవంతం
అందరికీ సాంకేతిక ఫలాలు కార్యాలయ పనుల కంప్యూటరీకరణ లేదా డిజిటలీకరణనే ఈ-ఆఫీస్ అంటారు. రహస్య ఫైళ్లకు సంబంధించిన పనులను ఈ వేదిక మీద చేయడం లేదు. తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకున్న తరవాత ఈ తరహా పనులకు వీలు కల్పిస్తారు. భారతదేశం 2006లోనే ఎలెక్ట్రానిక్ పాలన ప్రణాళికను చేపట్టింది. దీని కింద 2015లో ప్రారంభమైన డిజిటల్ ఇండియా పథకం పౌరులందరికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఆన్‌లైన్‌లో వేగంగా ప్రభుత్వ సేవలు అందించాలని లక్షిస్తోంది. ఎలక్ట్రానిక్ పాలనా ప్రణాళిక కింద ఆధార్, భూ రికార్డుల కంప్యూటరీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ-సేవ తదితర సౌకర్యాలను ప్రారంభించారు. భారతదేశంలో మెల్లగా వేళ్లూనుకుంటున్న డిజిటల్ పాలన కరోనాతో వేగం పుంజుకొంది.
ఆ సత్తా సాంకేతిక పరిజ్ఞానానికి ఉంది!
చిత్తశుద్ధి ఉంటే డిజిటల్ ప్రభుత్వానికి అవినీతిరహిత పారదర్శక పాలనను అందించడం చిటికెలో పని. కొవిడ్ వ్యాధి తగ్గుముఖం పట్టిన తరవాత ఆర్థిక వ్యవస్థను ఉత్తుంగ శిఖరాలకు ఉరకలెత్తించాలంటే అవినీతి నిర్మూలన, పారదర్శకత, జవాబుదారీతనం చాలా కీలకమవుతాయి. అవినీతిపై అంకుశంగా, పారదర్శకతకు సైదోడుగా నిలిచే సత్తా సాంకేతిక పరిజ్ఞానానికి ఉంది. డిజిటల్ ప్రభుత్వం సాంకేతికత సాయంతో పాలనా ప్రక్రియలను స్వయంచాలితం చేసి, పన్ను చెల్లింపులు, వివిధ గుర్తింపు సంఖ్యల జారీవంటివి ఆన్‌లైన్‌లో జరిపే సౌకర్యం కల్పిస్తుంది. తద్వారా అవినీతికి తావు లేకుండా పౌర సేవలను అందించగలుగుతుంది. డిజిటల్ ప్రభుత్వం పౌరుల నమ్మకం, ఆదరణను ప్రోదిచేసుకుంటే, కొవిడ్ అనంతరం ప్రగతి రథాన్ని పరుగులు తీయించడానికి కావలసిన నైతిక స్థైర్యం సమకూరుతుంది. కాబట్టి, పౌరులకు సత్వరం డిజిటల్ సేవలు అందించడానికి ఇప్పటి నుంచే మౌలిక వసతుల నిర్మాణంపై పెట్టుబడులు పెట్టాలి. కేంద్ర ఉద్యోగులకు విడతలవారీగా ఇంటి నుంచి పని అప్పగించి, వసతులను అందించడం ద్వారా దీనికి కొంత ఊపు వచ్చింది.
అధిగమించాల్సిన అగాధం
డిజిటల్ పాలనలో సరిదిద్ధాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయి. భారతదేశంలో ఈ ప్రక్రియను సమాజంలో అన్ని వర్గాలు సమాన ఫాయాలో అందుకోలేకపోతున్నాయి. బడుగు వర్గాలను డిజిటల్ అక్షరాస్యులుగా మార్చి దేశంలో డిజిటల్ అగాధాన్ని అధిగమించాలి. ప్రస్తుతం ఇండియాలో పేదలు ఇంటర్నెట్ సౌకర్యం అమర్చుకోలేకపోతున్నారు. గ్రామాలకు పూర్తిస్థాయిలో నెట్ సౌకర్యం అందాలంటే ఇంకా సమయం పట్టేట్లుంది. సీనియర్ ప్రభుత్వోద్యోగులు, అధికారులు, ప్రైవేటు సంస్థల సిబ్బందికి డిజిటల్ పరిజ్ఞాన వినియోగంలో తగిన శిక్షణ ఇవ్వాలి. డిజిటల్ ప్రభుత్వానికి పటిష్ఠమైన ఐసీటీ (సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత) వ్యవస్థ కావాలి. ఇది ఏర్పడటానికి ప్రధాన సమస్య నిధుల కొరతే. కాబట్టి ప్రైవేటు పెట్టుబడులకూ ప్రవేశం కల్పిస్తున్నారు.