ప్రపంచం మొత్తం మందగమనంలో ఉంటే భారత్లో మాత్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తగిన సమయమని మోదీ ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులకు దేశం సాదరస్వాగతం పలుకుతోందని పేర్కొన్నారు.
ఈ మేరకు ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణతో ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా సంభాషించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. స్వయం సమృద్ధి సాధించాలన్న కళ సాకారం చేసుకునే దిశగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని పేర్కొన్నట్లు తెలిపింది. దీని వల్ల దేశంలో సమర్థవంతమైన, అంతరాయం లేని సప్లై చైన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవచ్చని మోదీ వెల్లడించినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
75 శాతం ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసుకునే విధంగా ఐబీఎం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై మోదీ మాట్లాడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురయ్యే సవాళ్లపై చర్చించినట్లు పేర్కొంది. ప్రత్యేకంగా భారత్లోని వైద్య వ్యవస్థ కోసం కృత్రిమ మేధ ఆధారిత పరికరాలు తయారు చేసే విషయంలో సాధ్యాసాధ్యాలపై మోదీ చర్చించినట్లు వెల్లడించింది.
వైద్య వ్యవస్థలో వేగంగా అడుగులు
ఈ సందర్భంగా కరోనా ప్రభావంపై మాట్లాడిన మోదీ.. వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతిని వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున అవలంబిస్తున్నాయని అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, సాంకేతిక మార్పులు, రెగ్యూలేటరీ వాతావరణం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.