కరమ్‌వీర్ గురించి వినేవింటారు. ఎప్పుడైనా కలంవీర్ గురించి విన్నారా. ఇద్దరు కలంవీరుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వారి కళానైపుణ్యాలు చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. దక్షిణ దిల్లీలోని ఘిటోర్‌నీ గ్రామంలోని రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన అమితాబ్, నిశా... స్కెచింగ్‌లో ఒకరిని మించిన ప్రతిభావంతులు మరొకరు. ఇద్దరి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో...అమితాబ్ ఓ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటే, నిశా గడ్డు పరిస్థితుల్లో చదువు పూర్తిచేస్తోంది. స్కెచింగ్ వేయడం అమితాబ్‌కు చిన్నప్పటినుంచీ అలవాటే. ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. చాలా చిన్న వయసు నుంచే పెన్సిల్ చేతబట్టి బొమ్మలు గీసే నైపుణ్యాలు అతడి సొంతం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అమితాబ్ స్కెచింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నాడు.
12వ తరగతి పూర్తయ్యాక, కళాశాలకు వెళ్లినప్పుడు...కొందరు చదువుకుంటుండగా, మరికొందరు ఇతర వ్యాపకాలతో గడపడం గమనించాను. వాళ్లందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలని అనిపించింది. ఓచోట ఉచితంగానే స్కెచింగ్ కోర్సు నేర్పిస్తున్నారని ప్రీతి అనే నా స్నేహితురాలు చెప్పింది. నన్నూ వెళ్లి చేరమని సలహా ఇచ్చింది. అక్కడికి వెళ్లి, సర్‌ను కలిశాను. చిన్నతనంలో నేను వేసిన స్కెచ్‌లు చూపించాను. షాపు ద్వారా వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోతోంది. కొన్నిసార్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా నా స్కెచ్‌లకు కొంత డబ్బు వస్తోంది. స్కెచింగ్ ద్వారా అదనపు ఆదాయం వస్తుండడంతో నా సమయాన్ని వృథా చేయలేదని మా నాన్న కూడా ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు.
---అమితాబ్, చిత్రకారుడు
కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతలు చూసుకుంటున్నాడు అమితాబ్. ఇంటి నుంచి దుకాణం వరకూ కాలినడకనే వెళ్లడం ఈ యువకుడికి అలవాటు. ఎప్పుడు సమయం చిక్కినా... పెన్సిల్ చేతబట్టి, స్కెచింగ్ వేయడం ప్రారంభిస్తాడు.
ఒక్కసారైనా వారిని కలిసి..
తన ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో స్కెచింగ్ నైపుణ్యాలకు పదును పెడుతున్నాడు అమితాబ్. స్కెచింగ్ కళను ఆసక్తి ఉన్న చిన్నారులకు ఉచింతగా నేర్పించాలనుకుంటున్నాడు. జీవితంలో ఒక్కసారైనా అమితాబ్ బచ్చన్, ప్రధాని నరేంద్రమోదీని కలిసి, వారికోసం వేసిన స్కెచింగ్‌లను బహుమతిగా ఇవ్వాలని కలలు గంటున్నాడు.