మిడతలకు ఎలాంటి పంట అనేది సంబంధం ఉండదు. పచ్చగా ఏది కనపడితే దాన్ని శుభ్రంగా ఆరగించేస్తాయి. మిడతల దండు పొలంలో పడిందంటే ఇక ఆ పొలంలో ఏదీ మిగలదు. కొన్ని గంటల్లోనే అక్కడ ఒక పంట ఉన్నదన్న సంగతే తెలియకుండా సర్వనాశనం చేస్తాయి. మరి అలాంటి మిడతల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!
- పశ్చిమ భారతంలో పంటపొలాలపై దాడి చేస్తున్న మిడతలు మన ఇంటి పరిసరాల్లో చూసే మిడతల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే మన ఇంటి వద్ద ఒకటి రెండు మిడతలు కనపడితే, అక్కడ మాత్రం వేలు, లక్షల సంఖ్యలో ఒక్కసారిగా వస్తాయి.
- మిడతలు కేవలం మొక్కలను మాత్రమే తింటాయి. పొడి వాతావరణంలో ఇవి ఎక్కువగా తిరుగుతాయి. వర్షాలు పడగానే వాటి సంతోనోత్పత్తి పెరిగి తీవ్ర దశకు చేరతాయి.
- ఎడారి మిడతలుగా కూడా వీటిని పిలుస్తారు. ఇవి వేగంగా ప్రయాణించగలవు. ఒక రోజులో 150కి.మీ. వరకూ ఇవి ప్రయాణిస్తాయట. వాటికి ఓపిక కూడా ఎక్కువ. అధిక సమయం గాలిలోనూ ఎగురుతూ కూడా ఉండగలవు.
- ఇవి పంటలకు తీవ్ర నష్టాన్ని చేస్తాయి. పొలంపై పడితే ఆ పంటపై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రతి మిడతా దాని బరువుకన్నా కాస్త ఎక్కువగానే లాగించేయగలదు.
- కి.మీ. పరిధి గల ప్రాంతాన్ని 80మిలియన్ల మిడతలు ఆక్రమించగలవు. అంతేకాదు, 35వేలమందికి సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులో తినేస్తాయి.
- ఎడారి మిడతల జీవితం కాలం 90 రోజులు. ఈ కాలంలో అవి రెండు గుడ్లు పెడతాయి. ఆరు వారాల్లో అవి పెరిగి పెద్దవి అవుతాయి. అలా పెరిగి పెద్దయిన మిడతలు నెల రోజుల్లో మళ్లీ గుడ్లు పెడతాయి.
- వీటి సంతానోత్పత్తి గణనీయంగా ఉంటుంది. మూడు నెలల్లో ఇవి 20రెట్లు పెరుగుతాయి. ఆరు నెలల్లో 400 రెట్లకు, 9నెలల్లో 8వేల రెట్లకు ఇవి పెరిగిపోతాయి.
- ప్రస్తుతం భారతదేశంపై దాడి చేస్తున్న ఈ మిడతల జన్మస్థానం తూర్పు ఆఫ్రికా, సూడాన్., అవి అక్కడి నుంచి మొదలై సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్‌కు వచ్చాయి. పాక్ నుంచి ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించాయి.
- ఈ మిడతల దండు తొలుత రాజస్థాన్‌లో ప్రవేశించి ఆ తర్వాత పశ్చిమ భారతంలోని రాష్ట్రాలకు విస్తరించింది. రాజస్థాన్‌లో మొత్తం 33 జిల్లాలు ఉండగా, 16 జిల్లాల్లో మిడతల ప్రభావం ఉంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్‌కు గడ్డుకాలమే.
- మిడతల దండును ఇప్పుడు నియంత్రించలేకపోతే 8వేల కోట్ల విలువైన పెసరపంట నాశనం అవుతుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- ప్రపంచంలోని ఇతర వలస కీటకాలతో పోలిస్తే, మిడతల దండు అత్యంత ప్రమాదకరమైనదని యునైటెడ్ నేషన్స్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. వీటి వల్ల ఆహార సంక్షోభం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
- గ్లోబల్ వార్మింగ్(భూతాపం)కారణంగా మిడతల దండులు, అవి చేసే దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు పడకపోవడం వల్ల భూతాపం పెరిగి, మిడతలు మరింత విజృంభించే అవకాశం ఉందని వెల్లడించారు.