పాక్ చెరలో ఉన్న భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు దౌత్యవేత్తలతో మాట్లాడేందుకు అనుమతించాలని భారత్ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును దృష్టిలో ఉంచుకుని అందుకు తగినట్లు పూర్తి సహకారం అందివ్వాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ సూచించారు.
"అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునకు అనుకూలంగా పూర్తి అంగీకారంతో జాదవ్‌ను దౌత్యవేత్తలతో మాట్లాడేందుకు త్వరగా అనుమతించాల్సి ఉంది. ఈ మేరకు పాక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. పాకిస్థాన్‌కు మా డిమాండ్లు ఏంటో తెలిపాం."
- రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్‌లో జైలు జీవితం గడుపుతున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసును పునఃసమీక్షించాలని పాక్‌కు స్పష్టం చేసింది ఐసీజే. జాదవ్‌కు న్యాయవాదిని కలిసే హక్కు ఉందని తేల్చి చెప్పింది.
భారత నావికాదళ మాజీ అధికారిని ఇరాన్లో వ్యాపారం నిర్వహిస్తుండగా 2016లో పాక్ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత పాక్‌లోకి ప్రవేశిస్తుండగా బలూచిస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. విచారించిన పాక్ సైనిక న్యాయస్థానం 2017లో జాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: జాదవ్ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే