బిహార్‌లో ప్రస్తుతం నిరుద్యోగం, వ్యవసాయ కార్పొరేటీకరణ, కరోనా విజృంభణే ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్. బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు తేజస్వీ.
రైతుల సమస్యల పరిష్కారానికి ఆర్జేడీ ఎల్లప్పుడూ పోరాడుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుల వల్ల రైతుల ఆర్థిక భద్రత దెబ్బతింటుందని హెచ్చరించారు. బిల్లులు సరిగా ఉంటే ప్రభుత్వంలో భాగమైన కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేశారని ప్రశ్నించారు.
బిహార్ ఎన్నికలను నిరుద్యోగ యువకులు, ప్రజాస్వామ్య అనుకూల శక్తుల కూటమికి.. అధికార, రాజ్యాంగ వ్యతిరేక పాలన అందించిన శక్తుల కూటమికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు తేజస్వి.
తన విజయాల గురించి గర్వంగా చెబుతున్న నితీశ్‌కుమార్.. ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే.. సింగిల్ డిజిట్ సీట్లను సైతం గెలుచుకోలేరని తాను బలంగా నమ్ముతున్నట్లు నొక్కిచెప్పారు. నితీశ్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి ప్రచార ఆర్భాటాలకు పోతోందని దుయ్యబట్టారు.