అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. 11 మంది పూజారుల శాస్త్రోక్త మంత్ర పఠనం మధ్య ఉదయం 8 గంటలకు వైదిక సంప్రదాయం ప్రకారం.. గౌరీ గణేశ పూజతో ఈ కార్యక్రమం మొదలైంది. భూమిపూజను పురస్కరించుకుని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
చారిత్రక ఘట్టానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రామాలయాల్లో కూడా రామాయణ పారాయణం కొనసాగింది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మందిర నిర్మాణం మొదలవుతుందని స్థానిక పూజారులు వివరించారు.
కట్టుదిట్టమైన భద్రత
భూమిపూజను పురస్కరించుకుని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు పట్టణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ సహా భూమిపూజ జరిగే ప్రాంతాల్లో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ఠ చర్యలను చేపడుతున్నారు.