తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారి​వి తప్పుడు హామీలు- ఇవిగో సాక్ష్యాలు' - Terrorism

2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్​ పార్టీ నెరవేర్చలేదంటూ... వాటి జాబితాను రైల్వే మంత్రి పియూష్​ గోయల్ వివరించారు. వీటన్నింటిని భాజపా అమలు చేసినట్టు తెలిపారు.

"కాంగ్రెస్​వి తప్పుడు హామీలు.. ఇవిగో సాక్ష్యాలు"

By

Published : Apr 7, 2019, 7:24 AM IST

"కాంగ్రెస్​వి తప్పుడు హామీలు.. ఇవిగో సాక్ష్యాలు"

2004, 2009 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ పలు తప్పుడు హామీలు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. వీటిని హస్తం పార్టీ విస్మరించినప్పటికీ... భాజపా ప్రభుత్వం నెరవేర్చినట్లు తెలిపారు రైల్వే శాఖ మంత్రి పియూష్​ గోయల్​.

కాంగ్రెస్​ పార్టీకి ఉన్న అసహన వైఖరి ప్రస్తుతం స్పష్టమైంది. తప్పుడు హామీలు, మాటలు చెబుతూ దేశ ప్రజలను ఎల్లవేళలా మోసం చేయలేరు. ప్రజలకు అన్నీ తెలుసు. కాంగ్రెస్​ పార్టీ తప్పుడు ప్రకటనలతో వారు మోసపోరు. - పియూష్​ గోయల్​, రైల్వే మంత్రి

కాంగ్రెస్​ పార్టీ 2004, 2009 ఎన్నికల హామీల్లో నెరవేర్చని వాటిని విశదీకరించారు పియూష్​ గోయల్​. వీటిని ఐదు సంవత్సరాల్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి చేసినట్లు తెలిపారు.
రైతుల ఆదాయం

రైతులకు ప్రత్యక్ష ఆదాయం అందిస్తామని 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిందని, కానీ 10 సంవత్సరాల్లో అమలు చేయలేకపోయిందన్నారు గోయల్​. మోదీ ప్రభుత్వం రూ.6వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తుందని తెలిపారు.

విద్యుత్​ సౌకర్యం

ప్రతీ ఇంటికి విద్యుత్​ సౌకర్యం అందిస్తామని కాంగ్రెస్​ పార్టీ 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు తెలిపారు గోయల్​. 3 నుంచి 5 ఏళ్లలో దీన్ని సాధిస్తామని అప్పటి కాంగ్రెస్​ అధ్యక్షురాలు ఆ సమయంలో ప్రకటించారని.... 2009 ఎన్నికల్లోనూ ఆ హామీనే ఇచ్చినట్ల గుర్తుచేశారు. కానీ భాజపా ప్రభుత్వం వచ్చే నాటికి 18వేల గ్రామాలకు విద్యుత్​ సౌకర్యం లేదని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేశామని స్పష్టం చేశారు గోయల్.

ఉగ్రవాదం

ఉగ్రవాద చర్యలను సహించబోమని గత మేనిఫెస్టోలో కాంగ్రెస్​ పార్టీ ప్రకటించినట్లు తెలిపారు పియూష్​ గోయల్​. కానీ కసబ్​ లాంటి ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధించటం ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీకి నచ్చట్లేదని ఆరోపించారు.

ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ ఏ విధంగా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నదో దేశం మొత్తం చూస్తోంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడు... కాంగ్రెస్​, మిత్ర పక్షాలు, పార్టీ అధ్యక్షుడు, సీనియర్​ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తీవ్రవాదులకు మద్దతిస్తున్నారు. మన దేశం, సైన్యాన్ని బలహీనపరచేందుకు ఉగ్రవాదులకు మద్దతిస్తున్న దేశాల టీవీల్లో వీళ్ల ప్రసంగాలు వస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీ ఉగ్రవాదుల విషయంలో ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించిందో తెలుసుకోవటానికి ఉదాహరణే పోటా చట్టాన్ని(ఉగ్రవాద నిర్మూలన చట్టం) తొలగించటం.

- పియూష్​ గోయల్​, రైల్వే మంత్రి.

ఆర్థికంగా వెనుకబడిన తరగతులు

ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ప్రకటించప్పటికీ నెరవేర్చలేదని పియూష్​ గోయల్​ అన్నారు. తమ పార్టీనే ఈ హామీని నెరవేర్చిందని తెలిపారు.

ఒకే ర్యాంకు, ఒకే పింఛను

సైనికోద్యోగులకు ఒకే ర్యాంకు, ఒకే పింఛను హామీని కాంగ్రెస్​ పార్టీ విస్మరించినప్పటికీ తమ ప్రభుత్వమే అమలు చేసిందని తెలిపారు.

అవినీతి నిర్మూలన

అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తామని, నల్లధన సృష్టి జరగకుండా చర్యలు తీసుకుంటామని 2004లో కాంగ్రెస్​ హామీలు గుప్పించిందని గోయల్​ తెలిపారు. అగస్టా వెస్ట్​ల్యాండ్​, కామన్​వెల్త్​, 2జీ లాంటి కుంభకోణాలు ఆ పార్టీ హయాంలో జరిగాయని గుర్తు చేశారు పియూష్​​. మోదీ ప్రభుత్వం నల్లధనంతో పాటు అవినీతి లేకుండా చేసిందని ప్రకటించారు. చట్ట పరమైన చర్యలతో చాలా మందిని రుణాలు కట్టే విధంగా చేశామని తెలిపారు.

జీఎస్టీ

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటామని, వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అమలు చేస్తామని 2009లో కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చినట్లు తెలిపారు గోయల్​. ఆ ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ మెరుగవటం బదులు వృద్ధి రేటు పడిపోయిందని, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరిగాయని, ద్రవ్య లోటు 6.5 శాతానికి చేరిందని ఎద్దేవా చేశారు.

అంతర్జాలం

మూడు సంవత్సరాల్లో దేశమంతా బ్రాండ్​బ్యాండ్​ సౌకర్యాన్ని తీసుకొస్తామని 2009లో కాంగ్రెస్​ హామీ ఇచ్చిందని... 2014 వరకు కేవలం 59 గ్రామాలకు మాత్రమే అంతర్జాలం చేరిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం 1.2 లక్షల గ్రామాలకు ఈ సౌకర్యాన్ని అందించినట్లు ప్రకటించారు పియూష్​ గోయల్​.

ABOUT THE AUTHOR

...view details