మోదీ సర్కార్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ నిరాశాజనకంగా, ఎందుకూ సరిపోని విధంగా ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం విమర్శించారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పి కేవలం రూ.1.86 లక్షల కోట్లు విదిల్చారని, ఇది జీడీపీలో 0.91 శాతం మాత్రమేనని ఆయన ఆరోపించారు.
నిరాశాజనకం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో... పేదలు, వలసదారులు, రైతులు, కార్మికులు, చిన్న దుకాణదారులు, మధ్యతరగతి ప్రజలకు సరైన కేటాయింపులు చేయలేదని చిదంబరం అన్నారు.
"నేను పూర్తిగా నిరాశ చెందాను. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ను కాస్త మెరుగ్గా సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదనంగా మరో రూ.10 లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాను."
- పి.చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి