సాగు చట్టాలకు సవరణలు చేయాలన్న మునుపటి ప్రతిపాదనపై తమ అభిప్రాయాన్ని తెలపాలని రైతులను కోరింది కేంద్రం. మరోసారి చర్చలకు అనుకూలమైన తేదీని ఎంచుకోవాలని 40 రైతు సంఘాలకు లేఖ రాసింది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. రైతులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కేంద్రం మనస్ఫూర్తిగా అన్ని ప్రయత్నాలు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్.
ఈ సవరణ ప్రతిపాదనలను రైతులు ఇదివరకే తోసిపుచ్చారు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
అయితే రైతుల స్పందన చాలా సంక్షిప్తంగా ఉందని, ప్రతిపాదనలను తిరస్కరించడానికి సరైన కారణం చెప్పలేదని పేర్కొన్నారు వివేక్ అగర్వాల్. ప్రతిపాదనలపై ఉన్న సందేహాలను ప్రభుత్వంతో పంచుకోవాలని కోరారు. ఇంకోసారి చర్చలు జరిపేందుకు తేదీ నిర్ణయించాలని సూచించారు.