తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ట్రస్ట్' పాలిటిక్స్​: చట్ట ఉల్లంఘనా? కక్షసాధింపా?

విరాళాల సేకరణలో రాజీవ్​ గాంధీ ఫౌండేషన్ చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలపై విచారణకు ఆదేశించింది కేంద్రం. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ చర్యను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించింది కాంగ్రెస్​. భాజపా మాత్రం ఈ విమర్శల్ని తోసిపుచ్చింది.

Govt would not have waited for six years if politics was behind probe into RGF transactions: BJP
రాజీవ్​ ట్రస్టుకు విరాళాలపై భాజపా కాంగ్రెస్​ మాటల యుద్ధం

By

Published : Jul 8, 2020, 4:01 PM IST

నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థల విషయంలో వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం . దర్యాప్తు కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ అంతర్‌ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్పెషల్‌ డైరెక్టర్‌ నేతృత్వం వహించనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా ఈ కమిటీలో భాగంగా ఉండనుంది. ఈ విషయాల్ని కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు.

రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌(ఆర్‌జీఎఫ్‌), రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌లకు వచ్చే నిధుల విషయంలో మనీలాండరింగ్‌, ఎఫ్‌ఆర్‌సీఏ, ఐటీ వంటి చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి. ఆర్‌జీఎఫ్‌కు సోనియా గాంధీ ఛైర్‌పర్సన్‌గా.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పి.చిదంబరం ట్రస్టీలుగా ఉన్నారు. రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌కు కూడా సోనియా గాంధీయే ఛైర్‌పర్సన్‌. ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ బాధ్యతల్ని ప్రస్తుతానికి ఆమే నిర్వహిస్తున్నారు.

'రాజకీయ ప్రతీకారం'

రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​పై విచారణకు ఆదేశించడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించింది కాంగ్రెస్​. చైనాతో సరిహద్దు వివాదం, కరోనా వంటి కీలక విషయాలపై దృష్టి సారించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్​ నేత మనీశ్​ తివారీ మండిపడ్డారు. ఈ చర్యలు అక్రమమని, భాజపా కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

ఆరేళ్లు ఆగాల్సిన అవసరం లేదు..

కాంగ్రెస్​ ఆరోపణలను భాజపా ఖండించింది. ఆర్​జీఎఫ్​ విరాళాల్లో పారదర్శకత కోసమే విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. రాజీవ్ ట్రస్టులకు విరాళాల లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇటీవలే బహిర్గతమైన విషయాన్ని గుర్తు చేసింది. రాజకీయ దురుద్దేశంతో చేపట్టిన చర్యలైతే భాజపా అధికారంలోకి వచ్చిన ఆరేళ్ల వరకు ఆగి ఉండాల్సిన అవసరం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు.

చైనా వివాదంతో..

భారత్, చైనా సరిహద్దు వివాదంపై అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినా.. ప్రధాని మోదీ ఆ విషయాన్ని అంగీకరించడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. మన భూభాగంలో ఎవరూ చొరబడలేదన్న మోదీ ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే చైనాకు ‘మోదీ సరెండర్’ అయ్యారంటూ ఆరోపించింది. కొవిడ్‌ కట్టడి కోసం ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్‌’ నిధికి చైనా నుంచి విరాళాలు అందాయని ఆరోపించింది.

గాంధీ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌లకే చైనా నుంచి నిధులు అందుతున్నాయని కాంగ్రెస్​పై భాజపా ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో ఎఫ్‌ఆర్‌సీఏ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. అలాగే యూపీఏ హయాంలో పీఎం రిలీఫ్‌ ఫండ్‌కు వచ్చిన నిధుల్ని ఆర్‌జీఎఫ్‌కు తరలించారని ప్రత్యారోపణలు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థలపై విచారణకు కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: లాకప్​డెత్​ కేసుపై సీబీఐ దర్యాప్తు షురూ

ABOUT THE AUTHOR

...view details