వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. జల్‌జీవన్ పథకం ద్వారా 2024 లోగా లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. మహారాష్ట్ర పర్యటనలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన ఔరంగాబాద్ బహిరంగ సభలో ప్రసంగించారు.
"జల్ జీవన్ మిషన్ను ప్రారంభించాం. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. సోషలిస్టు నేత రామ్‌మనోహర్ లోహియా 1970లోనే చెప్పారు. మహిళలకు ఉన్న ప్రధాన రెండు సమస్యలు.. శౌచాలయం, ఇంటిని నడిపేందుకు నీరు. ఈ రెండింటినీ పరిష్కరిస్తే దేశ సమస్యలకు మహిళలే సమాధానమిస్తారు. లోహియా వెళ్లిపోయారు. ఎన్నో ప్రభుత్వాలు, నేతలు వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు మేం దీన్ని మార్చబోతున్నాం. ఇక ప్రతి ఇంటిలో శౌచాలయం ఉంటుంది. నీళ్లూ ఉంటాయి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి