విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను మే 7నుంచి చేపట్టనున్నట్లు తెలిపింది కేంద్ర హోంశాఖ. దశలవారిగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే భారత్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. విమానాలు, నౌకల ద్వారా ఈ తరలింపు ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం వారందరూ ప్రయాణఖర్చులు చెల్లించవలసి ఉంటుందని వివరించారు అధికారులు.
నిర్బంధం తప్పదు..
కేంద్రం ప్రకటన మేరకు భారత్కు వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం 14 రోజులపాటు వారు నిర్బంధ కేంద్రాల్లో ఉండాల్సి వస్తుంది. 14 రోజులు పూర్తయిన అనంతరం వారి విషయంలో తదుపరి ప్రక్రియ ప్రారంభిస్తారు. విదేశాల్లోని వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు నియమావళి ఏర్పాటు చేసింది కేంద్రం.
లక్షణాలు లేకుంటేనే..
ఇప్పటికే పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయుల్లో వెనక్కి తీసుకొచ్చే వారి జాబితాను రూపొందించాయి. జాబితా మేరకు వారిని స్వదేశానికి వచ్చేందుకు అనుమతించనున్నారు. ప్రయాణం ప్రారంభమయ్యే ముందు వైద్య పరీక్షలు నిర్వహించి లక్షణాలు లేనివారినే వెనక్కి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రయాణంలోనూ వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.