హాథ్రస్ హత్యాచార ఘటనలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజాన్ని కప్పిపెట్టేందుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం క్రూరమైన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను అనాగరికులుగా పరిగణిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
"హాథ్రస్ నిందితులను రక్షించడానికి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం క్రూరమైన మార్గాల్లో ప్రయాణిస్తోంది. విపక్షాలను, మీడియాను బాధితురాలి కుటుంబాన్ని కలవకుండా అడ్డుపడుతోంది. వారిని అనాగరికులుగా పరిగణిస్తూ వేధిస్తోంది. ఏ భారతీయుడూ ఇలాంటి చర్యలను సహించబోడు."