కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మళ్లీ అసత్యాలు పలికారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ- మధ్యప్రదేశ్ రైతుల మధ్య జరిగిన సమావేశంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన రాహుల్.. అలవాటు ప్రకారం మోదీజీ ఎప్పటిలాగే అబద్ధాలు చెప్పారన్నారు. కేంద్రం ఇకనైనా రైతుల బాధలను అర్థం చేసుకుని.. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని ట్వీట్ చేశారు.
మోసపూరిత చర్యలను ఆపండి: సుర్జేవాలా
అన్నదాతలకు కీడు తలపెట్టే చర్యలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను 'దేశ వ్యతిరేకులు'గా అభివర్ణించడం అవమానమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రధాని మోదీ.. మధ్యప్రదేశ్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి.. వారిని మభ్యపెడుతున్నారని విమర్శించారు సుర్జేవాలా. చలిలో రోడ్లపై నిరసన చేస్తున్న రైతుల బాధలను అర్థం చేసుకొని.. కేంద్రం ఇప్పటికైనా ఈ చట్టాలను రద్దు చేయాలన్నారు.