వలస కార్మికులకు సాయం చేసేందుకు సైన్యాన్ని ఉపయోగించాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. ఈ మేరకు దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆమ్ ఆద్మీ నేతలు సంజయ్ సింగ్, దిలీప్ పాండేతో కలిసి ధర్నా నిర్వహించారు.
అయితే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి నిరసన చేపట్టినందుకు ఆయనను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
వలస కూలీలను ఆదుకోవటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని యశ్వంత్ విమర్శించారు. ఫలితంగా చాలా మంది నడకదారిన వందలాది కిలోమీటర్లు ప్రయాణించారని.. ఈ ప్రక్రియలో కొంతమంది మరణించినట్లు పేర్కొన్నారు.
"కరోనా లాక్డౌన్ వల్ల లక్షలాది మంది వలసకూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లను తరలించేందుకు శ్రామిక్ రైళ్లు సరిపోవు. వాళ్ల గురించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. వాళ్లపై శ్రద్ధ పెట్టలేదు. ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల్లో ఇళ్లకు పంపించేది. దేశంలో 20 వేల రైళ్లు ఉన్నాయి. ఒక్కసారి 2.3 కోట్ల మందిని తరలించవచ్చు."