లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూనే చాలా మంది ఔత్సాహికులు తమలోని ప్రతిభను వెలికితీస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులను.. అందమైన కళాకండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వాటిని చెట్లకు వేలాడదీసి తన పెరటి తోటను ఆహ్లాదకరమైన ప్రదేశంగా మార్చారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవాగాహన కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
కొడగు జిల్లాకు చెందిన సతీశ్ పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు కృషిచేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణం అవశ్యకతను బోధిస్తున్న సతీశ్.. చేతల్లో దానిని చేసి చూపుతున్నారు. పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలను వృథాగా పోనీయకుండా వాటిని అందమైన వస్తువులుగా రూపొందిస్తున్నారు.
ఇంటి పెరడే అలంకరణ స్థానంగా..
ప్రకృతి ప్రేమికులైన సతీశ్.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూనే కొడగు జిల్లాలో పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో వాడిపారేసిన ప్లాస్టిక్ వస్తువులను రీసైకిల్ చేసి వాటిని అద్భుత కళాకండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి తన ఇంటి పెరడునే అలంకరణ స్థానంగా ఎంచుకున్నారీ ఉపాధ్యాయుడు.