కేంద్రం డబ్బులు ఇచ్చినా ఖర్చు చేయని ఎంపీలు! - ఎంపీల్యాడ్స్
స్థానిక ప్రాంత అభివృద్ధి పనుల కోసం.. ఎంపీల్యాడ్స్ పథకం కింద కేటాయించే నిధుల్లో ఖర్చుచేయని సొమ్ము వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 4 నాటికి ఈ పథకం కింద రూ.5,275 కోట్లు నిధులు ఖర్చుచేయలేదని లిఖితపూర్వకంగా పార్లమెంటుకు తెలిపింది.
ఎంపీల్యాడ్స్ కింద ఖర్చుచేయని నిధులు
By
Published : Mar 11, 2020, 5:33 PM IST
|
Updated : Mar 11, 2020, 10:46 PM IST
కేంద్రం డబ్బులు ఇచ్చినా ఖర్చు చేయని ఎంపీలు!
పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీఎల్ఏడీ) కింద కేటాయించిన నిధుల్లో ఖర్చు చేయని నిధుల వివరాలను లిఖితపూర్వకంగా పార్లమెంట్‌కు తెలిపింది కేంద్రం. 2020 మార్చి 4 నాటికి మొత్తం రూ. 5,275.24 కోట్లు వినియోగం కాలేదని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.
ఎంపీల్యాడ్స్ కింద.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 53,704.75 కోట్లు విడుదల చేసింది. వాటిలో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్.
గతంలోనూ ఇదే పరిస్థితి..
ఎంపీల్యాడ్స్ పథకం కింద విడుదలైన నిధుల్లో ఖర్చు చేయకుండా మిగిలిపోతున్న సొమ్ము వివరాలు:
సంవత్సరం
మిగులు నిధులు
2020 మార్చి 04 నాటికి
రూ. 5,275.24 కోట్లు
2019 మార్చి 31 నాటికి
రూ. 4,103.97 కోట్లు
2018 మార్చి 31 నాటికి
రూ. 4877.71 కోట్లు
2017 మార్చి 31 నాటికి
రూ. 5029.31 కోట్లు
ఎంపీల్యాడ్స్ పథకం కింద ప్రతి పార్లమెంటు సభ్యులు.. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏటా 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసేలా.. జిల్లా కలెక్టర్‌కు సూచించే అవకాశం ఉంటుంది. రాజ్యసభ సభ్యులు కూడా తాము ఎన్నికైన రాష్ట్రం నుంచి ఒకటి లేదా మరికొన్ని జిల్లాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించొచ్చు. పార్లమెంటు ఇరు సభలకు నామినేట్ అయిన సభ్యులు ఏదైనాా రాష్ట్రంలో ఒకటి లేదా ఎక్కువ జిల్లాలను ఎంపిక చేసుకోవచ్చు.
ఈ పథకంలో సంవత్సర కాలంలో ఖర్చు చేయాల్సిన నిధుల్లో మిగిలిన నిధులను.. మరుసటి ఆర్థిక ఏడాదిలో ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.