కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ సేవల జ్ఞాపకార్థం గౌరవంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. రెండు ప్రభుత్వ సంస్థలకు ఆమె పేరు పెట్టి గౌరవించింది. సుష్మా స్వరాజ్ 68వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది విదేశీ వ్యవహారాల శాఖ.
విదేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ప్రవాస భారత కేంద్రానికి సుష్మాస్వరాజ్ భవన్‌గా నామకరణం చేసింది. అలాగే దౌత్యవేత్తలకు శిక్షణను ఇచ్చే ఫారెన్ సర్వీసెస్ సంస్థకు 'సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ స్వరీసెస్'గా పేరు మార్చింది.
"దౌత్యకార్యాలయానికి, దేశ ప్రజలకు దివంగత నేత సుష్మా స్వరాజ్ చేసిన నిస్వార్థ సేవలకు గాను రెండు ప్రభుత్వ సంస్థలకు ఆమె పేరును పెట్టాం. ఫిబ్రవరి 14న కేంద్ర మాజీ మంత్రి జయంతిని పురస్కరించుకొని ఆమె గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నాం."
- విదేశాంగ శాఖ ప్రకటన.
చిన్నమ్మ ఔదార్యం...
విదేశాల్లో వివిధ కారణాల వల్ల చిక్కుకుపోయిన ఎంతో మందిని సురక్షితంగా తిరిగి భారత్‌కు రప్పించేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా భారత్‌లో చికిత్స పొందాలనుకున్న ఎంతో మంది పాకిస్థానీయులకు వీసా కల్పించి తన ఔదార్యాన్ని చాటుకుంది.
సాధించిన ఘనతలు...
హరియాణాలో అతి చిన్న వయసులోనే కేబినేట్ మంత్రి హోదా సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కారు సుష్మా. అంతేకాకుండా దేశంలో ఒక రాజకీయ పార్టీకి మొదటి మహిళా ప్రతినిధిగా, అలాగే దిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేసిన తొలి మహిళగానూ సుష్మాస్వరాజ్ చరిత్రలో నిలిచారు. 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా.. తిరిగి 1998లో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2009-14 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ప్రభుత్వ విధానాలను ఖండించారు. 7 సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వహించారు.
సుష్మా స్వరాజ్ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా సాధన చేశారు. గత ఏడాది ఆగస్టు 6న గుండె సంబంధిత వ్యాధితో మరణించారు.
ఇదీ చూడండి:మోదీపై అభ్యంతరకర పోస్టు.. వెంకయ్య నాయుడు ఫైర్