చైనాతో పాటు పాకిస్థాన్, నేపాల్ వంటి పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. దేశ సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసేందుకు అంతర్గత భద్రత విధుల్లో నుంచి బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి సరిహద్దు రక్షణ దళాలను క్రమంగా ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గతఏడాది సరిహద్దు దళాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమైన సందర్భంగా తొలిసారి ఈ అంశంపై చర్చించినట్లు చెప్పారు.
కేంద్ర హోంశాఖ నూతన విధానం రూపొందించే పనిలో నిమగ్నమైంది. దేశంలో ఎన్నికల నిర్వహణ సహా, అంతర్గత భద్రత విధులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు అప్పగించనున్నారు. ఇప్పటికే 3.25 లక్షల మంది సీఆర్పీఎఫ్ బలగాలను ప్రధాన అంతర్గత భద్రతా దళాలుగా గుర్తించారు. రానున్న బిహార్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 70:30 నిష్పత్తిలో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులను మోహరిస్తారు. ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పూర్తిస్థాయి భద్రత ఇంఛార్జిగా సీఆర్పీఎఫ్ వ్యవహరిస్తుంది. ఈ విధుల నుంచి బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి సరిహద్దు రక్షణ దళాలను క్రమంగా ఉపసంహరిస్తారు. ఎన్నికలు, శాంతిభద్రతల వంటి సాధారణ అంతర్గత విధుల నుంచి ఈ బలగాలను రానున్న కొన్ని ఏళ్లలోనే పూర్తిస్థాయిలో ఉపసంహరించుకునేందుకు కేంద్ర హోంశాఖ సంకల్పించింది. సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేయాలని ఇప్పటికే సరిహద్దు దళాలను ఆదేశించింది కేంద్రం.
- సీనియర్ అధికారి.