మోదీ ప్రభుత్వంపై మరోమారు విమర్శల దాడి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీఏ సర్కార్ అవలంబిస్తున్న విధానాలతోనే కోట్లాది ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది గొంతు వినేలా మోదీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం చేపట్టిన 'స్పీక్ అప్ ఫర్ జాబ్స్' ఉద్యమంలో ప్రజలు భాగం కావాలని కోరుతూ ట్వీట్ చేశారు రాహుల్.
మోదీ ప్రభుత్వ విధానాలు కోట్లాది ఉద్యోగాలు కోల్పోయేందుకు, జీడీపీ చారిత్రక పతనానికి కారణమయ్యాయి. అది దేశ యువత భవిష్యత్తును దెబ్బతీసింది. వారు చెప్పేది ప్రభుత్వం వినేలా చేద్దాం.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆరేళ్లలో 12 కోట్లు ఇచ్చేందుకు బదులు 14 కోట్ల ఉద్యోగాలను కోల్పోయేలా చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. ప్రస్తుతం యువత మేల్కొన్నారని.. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
ఒకదాని తర్వాత ఒకటి చేపట్టిన అసమర్థ విధానాలతో కోట్ల మంది భారతీయుల జీవనోపాధిని భాజపా కొల్లగొట్టిందని, యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టిందని ఆరోపించింది కాంగ్రెస్. 'స్పీక్ అప్ ఫర్ జాబ్స్' ఉద్యమంలో భాగమై భాజపా దుస్సాహసాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చింది.
ఇదీ చూడండి: 'కరోనా లాక్డౌన్ పేరుతో పేదలపై దాడి'