భారత్‌పై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపనుందన్న అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేస్తోంది కేంద్రం. వైరస్‌పై పోరులో ముందంజలో ఉన్న ఆరోగ్య, పారిశుద్ధ్య రంగాల్లోని సిబ్బందిపై ఒత్తిడి తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఆయా విభాగాల్లో మరింత మంది ఉద్యోగులను నియమించేందుకు యత్నిస్తోంది. ఆన్లైన్ విధానం ద్వారా వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
"కరోనా వల్ల భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. వైరస్‌పై ముందంజలో ఉండి పోరాడుతున్న అత్యవసర సిబ్బంది వారి విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు మరిన్ని మానవ వనరులు అవసరం. దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్ విస్తరణ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం."
-సిబ్బంది శిక్షణ, వ్యవహారాల శాఖ ప్రకటన