రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియమాలను అతిక్రమించి ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించింది కాంగ్రెస్. ఇది నల్లధనాన్ని భాజపా ఖజానాలోకి చేర్చేందుకేనని.. ఎన్నికల బాండ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఎన్నికల బాండ్ల ప్రక్రియ పూర్తిగా అపారదర్శకమని, మనీ లాండరింగ్‌ను ప్రోత్సహించడమేని ఆరోపించింది కాంగ్రెస్. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఈ పథకం వెనక ఉన్న 'క్విడ్ ప్రో కో'( నీకు ఇది నాకు అది) ఏమిటో తెలపాలని కోరింది.
లంచానికి మారుపేరుగా..
ఎన్నికల బాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సరికొత్త భారత్‌లో లంచాలు, అక్రమ కమీషన్స్కు మారుపేరే ఎన్నికల బాండ్లు అని దుయ్యబట్టారు.
భాజపా పెట్టెల్లోకి నల్లధనం...
ఎన్నికల బాండ్ల అంశంలో కేంద్రపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. భాజపా ట్రంక్ పెట్టెల్లోకి నల్లధనం చేర్చేందుకు వీలుగా ఎన్నికల బాండ్లను తీసుకొచ్చారని ఆరోపించారు. ఆర్బీఐ నియమాలను అతిక్రమించి, జాతీయ భద్రతా సమస్యలను తోసిపుచ్చి ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టారన్నారు. నల్లధనం అరికడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే అక్రమ సొమ్మును తమ ఖజానాలోకి నింపుకోవాలని చూస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు.