కరోనా ప్రభావంతో గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాలపై ప్రధానంగా దృష్టిసారించి... కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా వ్యూహాలు రచించింది. కార్మికులు, ఉద్యోగులకు ఊరట కలిగే విధంగా 15 సూత్రాల ప్రణాళికను ఆవిష్కరించింది.
ఆత్మనిర్భర భారత్ అభియాన్ పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీకి సంబంధించిన విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు విశదీకరించారు. భారత్ స్వయంశక్తితో ఎదగాలన్న లక్ష్యంతో 15 ఉద్దీపన చర్యల వివరాలు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా 6 ఎంఎస్ఎంఈల కోసమే కేటాయించారు.
ఎంఎస్ఎంఈపైనే దృష్టి
ఉద్దీపన చర్యల్లో భాగంగా చిన్న, మధ్య తరహా, కుటీర లఘు పరిశ్రమలపై ప్రధానంగా దృష్టి సారించారు నిర్మల. కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన ఈ ఎంఎస్ఎంఈలపై వరాల జల్లుకురిపించారు. ఇందుకోసం ఆరు చర్యలను ప్రతిపాదించారు.
లాక్డౌన్ కారణంగా మూతపడ్డ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తక్షణమే తెరిచి, లక్షలాది మంది జీవనోపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయాలు ఉపకరిస్తాయని తెలిపారు నిర్మల. కోట్లాది మంది చిన్న ఉద్యోగులు, కార్మికులకు ఇది ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తుందని స్పష్టం చేశారు.
ఎమ్ఎస్ఎమ్ఈల కోసం ఆరు చర్యలు