వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2021 పరీక్షను రద్దు చేసే ఆలోచనేదీ లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే పోటీ/బోర్డు పరీక్షలపై గురువారం ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వెబినార్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా 2021లో జరిగే సీబీఎస్, జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలపై విద్యార్థుల సందేహాలను తీర్చారు. జేఈఈ మెయిన్స్‌ను ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు నిర్వహించే అంశాన్ని పరిగణిస్తున్నట్లు రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
సీబీఎస్‌ఈ పరీక్షల గురించి ప్రస్తావిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. పరిస్థితులు మెరుగవకపోతే విద్యార్థులకు మరింత సమయం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పోటీ/బోర్డు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను కేంద్రమంత్రి అభినందించారు.
విద్యామంత్రి ఇంకేం చెప్పారంటే..
- కొవిడ్ పరిస్థితులు కొద్దికొద్దిగా మెరుగుపడుతున్నందున త్వరలోనే విద్యార్థులు తిరిగి పాఠశాలలకు వెళ్తారు. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించాయి.
- విద్యార్థుల విలువైన ఏడాది వృథా కావొద్దన్న ఉద్దేశంతోనే ఈ ఏడాది జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాం. కొవిడ్ సమయంలో ప్రపంచంలో జరిగిన అతిపెద్ద పోటీ పరీక్ష నీట్ కావడం విశేషం.
- ఈసారి నీట్ పరీక్షా కేంద్రాలను పెంచాం. విద్యార్థులు తమకు అనుకూలమైన ప్రాంతంలో పరీక్ష రాసే అవకాశం కల్పించాం. కరోనా పరిస్థితుల్లో జేఈఈ మెయిన్ 2020, నీట్ 2020 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ ఎంతగానో దోహదపడింది.
- నీట్ 2021ని రద్దు చేసే ఆలోచన లేదు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది మూడు సార్లు నీట్‌ను వాయిదా వేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో నీట్‌ను రద్దు చేయొచ్చు.. కానీ అలా చేస్తే విద్యార్థులు, దేశానికి భారీ నష్టం.
- ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే నీట్ పరీక్ష జరుగుతోంది. ఒకవేళ విద్యార్థులు ఆన్‌లైన్‌లో జరగాలనుకుంటే ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.
- ల్యాబ్ ప్రయోగాల కోసం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకపోతే ప్రాక్టికల్స్ నిర్వహించడం సాధ్యం కాదు. దీనిపై చర్చిస్తాం.
- ఇప్పటికే సీబీఎస్‌ఈ 30శాతం వరకు సిలబస్ తగ్గించింది. కొవిడ్ పరిస్థితులు ఇలాగే ఉంటే 2021లో జరిగే సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తాం. ఆ తర్వాత సిలబస్‌పై నిర్ణయం తీసుకుంటాం.
- జేఈఈ మెయిన్ 2021 సిలబస్‌పైనా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని బోర్డులు సిలబస్ తగ్గించగా.. మరికొన్ని బోర్డులు ఆ నిర్ణయం తీసుకోలేదు. అన్ని ప్రాంతాల విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేలా నిర్ణయం తీసుకుంటాం.
- జేఈఈ మెయిన్ పరీక్షను రెండు కంటే ఎక్కువ సార్లు నిర్వహించే అంశంపై పరిశీలనలు జరుగుతున్నాయి. ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు పరీక్ష నిర్వహించే ఆలోచనలో ఉన్నాం.
- పరీక్షల షెడ్యూల్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరగా నీట్ 2021, జేఈఈ మెయిన్ 2021 పరీక్షల తేదీలను ప్రకటిస్తామని రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
ఇదీ చూడండి:'రైతుల వెనక ఎవరున్నారో మీరే కనిపెట్టాలి'