కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వాస్తవానికి ఈ నెల 14తో పూర్తవ్వాలి. 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పడం గమనార్హం. తమ రాష్ట్రానికి చెందిన ఎంపీలతో ఆయన ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్ గురించి మాత్రమే యోగి ప్రస్తావించారా లేదా దేశవ్యాప్త లాక్‌డౌన్ గురించా అన్న విషయంలో స్పష్టత లేదు.
విద్యాసంస్థల ప్రారంభంపై..
దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్షించిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన అంశమని స్పష్టంచేశారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినా.. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా చూసేందుకు తమ మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు.
ప్రభుత్వం నుంచి మరో ప్యాకేజీ..
లాక్‌డౌన్ ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒక ప్యాకేజిని ప్రకటిస్తే ఎలా ఉంటుందనేది కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై ఇంకా పక్కాగా ఒక నిర్ణయానికైతే రాలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వినియోగాన్ని పెంచడానికి అవసరమైన చర్యల్ని ప్యాకేజిలో చేర్చేందుకు చర్చలు జరుగుతున్నా ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించారు. లాక్‌డౌన్ అనంతర పరిణామాలకు తగ్గట్టుగా కొన్ని పథకాల్లో మార్పులు తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు రాష్ట్రాల మధ్య, ఒక్కో రాష్ట్రం లోపల నిత్యావసర వస్తువుల రవాణా సజావుగా సాగేందుకు ట్రక్కు డ్రైవర్లు, కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి పవన్‌కుమార్ అగర్వాల్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.